స్కూళ్లలో సౌలతులు ఎప్పుడు?
విశాలమైన ప్రాంగణం, పచ్చని చెట్లు, ఆకర్షణీయమైన తరగతి గదులు, బోధనకు సరి పడా ఉపాధ్యాయులు, సరిపడా టాయిలెట్స్.. ఇలా అన్ని సౌకర్యాలు గల బడులలో తమ పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు సుముఖత చూపుతారు. నెలన్నరకు పైగా కాలాన్ని ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్ధులు మళ్ళీ బడిబాట పట్టడానికి సన్నద్ధమవుతున్నారు. నూతన విద్యా సం వత్సరం 12వ తేదీనుండి ప్రారంభమవుతున్నది. ఈ తరుణంలో ప్రతి ఏటా నిర్వహించే ‘బడి బాట’ కార్యక్ర మానికి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
జూన్ 3 నుండి 19 వరకు ఈ కార్యక్రమా న్ని నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. కొన్నేళ్లుగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నా ఆశించిన ఫలితాలు కానరాకపోవడం శోచనీయం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామంలో విధిగా ప్రభుత్వ బడి ఉండవలసిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది నిర్వహిం చే ‘బడిబాట’ ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది.
ప్రైవేటు, కార్పోరేటు పాఠశాలలు విపరీతంగా పెరిగిపోయి తమ అసంబద్ధ ప్రకటనలతో విద్యను వ్యాపారంగా మారుస్తున్న ఈ రోజుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయు లు ఏటా ఈ ‘బడిబాట’ కార్యక్రమంలో పాల్గొం టూ విద్యార్థుల సంఖ్యను పెంచుతూనే ఉన్నారు. వాస్తవానికి విద్యాశాఖను ‘వెకేషన్ డిపార్టుమెంట్’గా పరిగణిస్తూ జూన్ 11 వరకు సెలవులను ప్రకటించిన ప్రభుత్వం ముందుగానే షెడ్యూల్‌ని ప్రకటిస్తూ వస్తున్నది. అయినప్పటికీ, టీచర్లు ఎటువంటి సంపాదిత సెలవులు ఆశించకుండా ప్రభుత్వ బడుల పరిరక్షణకు కృషి చేస్తున్నారు.
నూతనంగా కొలువు తీరిన సర్కారు ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టడం ముదావహం. చిన్నచిన్న మరమ్మతులకు, బిల్డింగ్ కలరింగ్స్ వంటి పనులకు నిధులు కూడా కేటాయించడం హర్షణీయం. బడి ప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇప్పటికే విద్యార్థులకు అందించే రెండు జతల ఏకరూప దుస్తుల తయారీ ‘మహిళా సమాఖ్య’ సభ్యులకు అందించిన ప్రభుత్వం స్కూళ్లు ప్రారంభించే నాటికి దుస్తులు అందిస్తుందా లేదా వేచి చూడాల్సిందే.
టీచర్ల కొరతను తీర్చాలి
ఇప్పటికే చాలా పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేవు. మరుగుదొడ్లు కూడా సరిపడా లేవు. కొన్ని పాఠశాలల్లో ఉన్నా నీటి వసతి లేక నిరుపయోగంగా ఉన్నాయన్నదీ వాస్తవం. ఈ అంశాల న్నింటినీ పరిగణనలోకి తీసుకుని తగు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరోవైపు చాలా బడుల్లో టీచర్ల కొరత వెంటాడుతోంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మన రాష్ట్రం లో ఆరువేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు టీచర్ల కొరతకు అద్దం పడుతున్నాయి. టీచర్లకు తొమ్మిదేళ్లుగా పదోన్నతులు, ఆరేళ్లుగా బదిలీలు నిలిచిపోవడంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయి. టెట్ తో సంబంధం లేకుండా టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను ప్రారంభించడానికి షెడ్యూల్‌ను ప్రభుత్వం తాజాగా విడుదల చేయడం సంతోషదాయకం.
ఇంకోపక్క ఇప్పటికే 11,062 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించిన ప్రభుత్వం రాత పరీక్షలను నిర్వహించి నియామక ప్రక్రియను పూర్తి చేయాలి. అంతవరకు బోధనకు ఆటంకం కలగకుండా విద్యా వలంటీర్లను నియమించాలి. అధికా రంలోకి రాగానే ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చాలనే సదుద్దేశ్యంతో పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం స్కూళ్లలో పారిశు ద్ధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో ఔట్ సోర్సింగ్ విధానంలో పాఠశాలల్లో స్కావెంజర్లుగా పని చేసిన 28 వేలమందిని కరోనా సమయంలో తొలగించారు. తదుపరి పాఠశాల శుభ్రతను గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు అప్పగించారు. పాఠశాలల్లో స్కావెంజర్‌లను నియమించే విషయం పై ప్రభుత్వం స్పందించవలసి ఉంది. విద్యార్థులకు టై, బెల్టు, షూస్‌ను కూడా అందించాలి.
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అల్పాహార పథకం చాలా బడుల్లో కొనసాగడం లేదు. ఆ పథకాన్ని కొనసాగిస్తారా లేదా వేచి చూడాల్సిందే. బడుల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు అందడం లేదు. ఇప్పటికీ ఇంకా మూడు నెలలకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. పాఠశాలల్లో నెలకొన్న వివిధ సమస్యలకు ప్రభుత్వం పరిష్కార మార్గాలను అన్వేషించాలి. ఉపాధ్యాయుడికి ఎటువంటి బోధనేతర పనులు అప్పగించకుండా చూడాలి. అప్పుడు ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య సాధ్యపడుతుంది. ఆ దిశగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి.
సుధాకర్.ఏ.వి
సెల్: 9000674747






