1 May, 2026 | 1:50 PM

సంపూర్ణ సాధికారత దిశగా!

09-06-2024 12:00 AM

జనక మోహన రావు దుంగ :

ఆకాశంలో సగం కానీ అవకాశాల్లో మాత్రం కాదనే రీతిలో మన దేశంలో మహిళల పరిస్థితి ఉంది. ఇంతకా లం మహిళలను పురుషులు సాటివ్యక్తిగా ఎప్పుడూ చూడలేదు. వంటింటికి పరిమి తం చేశారు. పిల్లలను కనే యంత్రాలుగా మాత్రమే  చూశారు. కుటుంబ ఆర్థిక విషయాల్లో ఆమె పాత్ర ఏమీ ఉండేది కాదు. అయితే, ఇప్పుడిప్పుడే మహిళ కట్టుబాట్ల సంకెళ్లను తెంచుకుని బాహ్యప్రపంచంలో తనదైన స్థానం కోసం పోరాడుతోంది. ఆర్థికంగా కొంతమేరకు సాధికారత లభిం చింది. కానీ, మిగతా విషయాల్లో మాత్రం పూర్తి సాధికారత సాధించలేదు.

రాజకీయంగా, సామాజికంగా, ఆర్థ్ధికంగా పురు షులతోపాటు స్త్రీలు సమాన అవకాశాలు పొందినప్పుడు సాధికారితను సాధించినట్లుగా భావించాలి. మహిళలు సొంతంగా తమ జీవితాలపై అధికారాన్ని, నియంత్రిం చుకోగలిగే పలు వ్యూహాత్మక ఎంపికలు చేసుకొనే సామర్థ్యాన్ని పొందితే సాధికారితకు దగ్గరవుతారు. మహిళా సాధికారత, లింగ సమానత్వం ఒకదానితో మరోటి ముడిపడి ఉంటాయి.

మహిళా సాధికారత కోసం లింగ సమానత్వాన్ని సాధించాలి. అదే సమయంలో లింగ సమానత్వం కోసం మహిళలకు సాధికారత అవసరం. అందువల్ల ఈ రెండింటినీ వేర్వేరుగా చూడలేం. మనదేశ జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నారు. మహిళా సాధికారత ప్రాముఖ్యత సామాజిక, సాంస్కృతిక, ఆర్థి క, రాజకీయ ఇతర అంశాలకు విస్తరించిం ది. మొత్తం మీద దేశ సమగ్ర అభివృద్ధికి, పురోగతికి లింగ సమానత్వం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం చాలా ముఖ్యం.

దేశంలో మహిళల పరిస్థితి

‘జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023’ ప్రకారం లింగ సమానత్వంలో మన దేశం 146 దేశాలలో 127వ స్థానంలో ఉంది. దేశం లో కేవలం 14.94 శాతం మహిళలు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు.‘భారత ఎన్ని కల సంఘం’ అధికారిక డేటా ప్రకారం ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలున్నప్పటికీ డిసెంబర్ 2023 నాటికి దేశం మొత్తం మీద రాష్ట్రాల శాసనసభల్లో సగటు మహిళా ప్రాతినిధ్యం  13.9 శాతం మాత్రమే ఉంది. ఏప్రిల్ 2023 నుండి పంచాయతీలకు ఎన్నికైన ప్రతినిధులలో దాదాపు 46.94 శాతం మంది మహిళలు ఉన్నారు.

‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5’ ప్రకారం లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 1,020 మంది స్త్రీలు ఉన్నా రు. మరోవైపు 15 నుండి 49 సంవత్సరా ల వయస్సుగల స్త్రీలలో 18.7 శాతం తక్కు వ బరువుతోను, 21.2 శాతం మహిళలు ఎత్తుకు తగిన బరువు లేమితో ఉన్నారు. 53 శాతం రక్తహీనతతో బాధ పడుతున్నా రు. పురుషుల అక్షరాస్యత 84.7 శాతంతో పోలిస్తే స్త్రీలలో 70.3 శాతం మాత్రమే ఉంది. 20 నుండి 24 సంవత్సరాల వయ స్సు గల స్త్రీలలో 23.3 శాతం మంది 18 సంవత్సరాల కంటే ముందే వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు.

‘రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా’ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 2018-- కాలానికి ప్రతి లక్ష సజీవ జననాలకు ప్రసూతి మరణాల రేటు 97గా ఉంది. ‘అంతర్జాతీయ కార్మిక సంస్థ’ (ఐఎల్‌ఓ) ప్రకారం 81.8 శాతం మహిళల ఉపాధి అనధికారిక ఆర్థిక వ్యవస్థలో కేంద్రీకృతమై ఉంది. భారతదేశంలోని చాలామంది మహిళా కార్మికులు అధిక వేతనంతో కూడిన ఉద్యోగాల్లోకి రాలేక పోతున్నారని ఐఎల్‌ఓ తెలిపింది. 

నాటి నుండి నేటి వరకు...

ప్రాచీన భారతదేశంలో మహిళలు అన్ని విభాగాల్లో  పురుషులతో సమాన హోదా అనుభవించారు. కానీ, మధ్యయుగంలో మహిళల స్థాయి దిగజారింది. కొన్ని వర్గాలలో సతీ సహగమనం, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాల నిషే ధం వంటివి సామాజిక జీవనంలో భాగమయ్యాయి. బ్రిటిష్ పాలనలో రాజా రామమోహన్ రాయ్, ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫూలే మొదలైన సంఘ సంస్కర్తలు మహిళా అభ్యున్నతికి చేసిన పోరాటాల ఫలితంగా ‘1856 వితం తు పునర్వివాహ చట్టం’ రూపుదిద్దుకొంది. జాన్ ఇలియట్ డ్రింక్ వాటర్ బెతూనే 1849లో బెతూనే స్కూల్ ప్రారంభించా రు. ఇది 1879లో బెతూనే కళాశాలగా వృద్ధి చెంది భారతదేశంలో ‘మొదటి మహిళా కళాశాల’ అయింది. పండిత రమాబాయి వంటి చాలామంది మహిళా సంస్కర్తలు కూడా మహిళా అభ్యున్నతికి కృషి చేశారు.

ఊపందుకున్న స్త్రీవాద ఉద్యమం.. 

1970వ  సంవత్సరం తర్వాత స్త్రీవాద ఉద్యమం శీఘ్రగతిని పుంజుకుంది. మహి ళా సమూహాలన్నీ ఒక్కటిగా కలిసి మథుర అత్యాచార కేసును జాతీయ స్థాయిలోనే మొట్టమొదటి అంశంగా ముందుకు తెచ్చా యి. మథుర పోలీసు స్టేషన్‌లో బాలికపై అత్యాచారం చేసిన పోలీసులను ముద్దాయిలుగా నిలబెట్టడంలో విస్తృతమైన నిరసనోద్యమాలను 1979-, 80 సంవత్సరాలలో చేపట్టారు. ఈ నిరసనలు జాతీయ స్థాయిలో బహుళ వ్యాప్తి చెందాయి. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఇది నేర విచారణ స్మృతి, భారత శిక్షాస్మృతిలోగల సాక్ష్య చట్టానికి సవరణలు చేయడానికి దారితీసింది.

కిరణ్ బేడి ‘ఇండియన్ పోలీ స్ సర్వీస్’కు ఎన్నికయిన మొదటి మహిళా అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు. నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయాలు, మీడి యా, కళలు, సంస్కృతీ, సేవా విభాగాలు, విజ్ఞానశాస్త్ర, సాంకేతికత వంటి అన్ని రంగాలలో పాల్గొంటోంది. సుమారు పదిహే నేళ్ళపాటు భారతదేశపు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ప్రపంచంలో ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం పని చేసిన మహి ళగా ప్రసిద్ధి పొందారు. మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యు న్నత పదవులను అలంకరించారు. ప్రస్తుత రాష్ట్రపతి ఒక మహిళ కావడం దేశానికి ఎంతో గర్వకారణమని చెప్పొచ్చు.

ఎన్నో సవాళ్లు.. 

దేశంలో లింగ సమానత్వం, మహిళా సాధికారత పొందడానికి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో కూడిన సవాళ్లు ఎన్నో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలకు సామాజిక, సాంస్కృతిక నిబంధనలతో వివక్షత ఉంది. మహి ళలు ఇంటి పనులకే పరిమితం అవుతున్నారు. ఆర్థిక బాధ్యతలు, బయటి పనులు మగవారికి మాత్రమే పరిమితమైనవిగా భావించబడుతున్నాయి. వరకట్న సంప్రదాయం వేళ్లూనుకుంది. గ్రామీణ ప్రాంతా ల్లోని మహిళల అక్షరాస్యత రేటు ఇప్పటికీ తక్కువగానే ఉంది.

గృహ హింస, అత్యాచారాలు, మహిళా అక్రమ రవాణా, బల వంతపు వ్యభిచారం, పరువు హత్యలు, కార్యాలయాల్లో  లైంగిక వేధింపులు మొదలైనవి సవాళ్లుగానే నిలుస్తాయి. మహిళల మీద పురుషుల హింసకు ఆల్కహాలిజం ఒక కారణంగా నిలుస్తోంది. ఆర్థిక రంగం లో కూడా మహిళలు పక్షపాతానికి, వివక్షతకు గురవుతున్నారు. పిల్లల పెంపకం, ఇతర గృహ బాధ్యతల కారణంగా ఉపాధి కల్పించే వారు మహిళలపై తక్కువ విశ్వసనీయతను కలిగి ఉన్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలలో ‘గ్లాస్ సీలింగ్’ ఎఫెక్ట్ ఉంది. అంటే, పదోన్నతుల్లో  స్తులను కావాలనే వెనుకకు నెట్టుతున్నారు.

పరిష్కారాలు..

భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 14,15 (1), 15(3), 16, 21, 23 మహిళా సాధికారతకు మద్దతు ఇస్తున్నాయి. విద్యతో మహిళా సాధికారత పెరుగుతుంది. అందువల్ల మహిళలకు విద్యావకాశాలను పెంచాలి. ఇప్పటికే ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా లింగ ఆధారిత హింసను తగ్గించవచ్చు. మహిళలకు మార్కెట్ నైపుణ్యాలను అందించాలి. మహిళా సాధికారత దేశ సమగ్ర అభివృద్ధికి, శ్రేయస్సుకు అవసరం. ‘వికసిత్ భార త్  2047’ వైపు అడుగులు వేస్తున్నప్పు డు ప్రతీ స్త్రీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న సమాజాన్ని పెంపొందిం చడంలో ప్రభుత్వం, పౌర సంఘాలు, వ్యక్తులు, తమ సమిష్టి కృషిని అందించాలి. అందరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడే మహిళా సాధికారత సంపూర్ణంగా సుసాధ్యమవుతుంది.

వ్యాసకర్త సెల్: 8247045230