22 April, 2026 | 1:37 AM

కంకర రోడ్డుతో కష్టాలు తీరేదెన్నడో?

22-04-2026 12:00 AM

సదాశివపేట నిజాంపూర్ మార్గంలో ప్రయాణికులకు నరకయాతన

ఆరు నెలల నుండి అదే పరిస్థితి

సదాశివపేట, ఏప్రిల్ 21: సదాశివపేట నుండి నిజాంపూర్కు వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి దారుణంగా మారింది. సుమారు 1.5 కిలోమీటర్ల బీటీ రోడ్డును కంకర రోడ్డుగా మార్చి అలాగే వదిలేయడంతో, ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ వందలాది మంది వాహనదారులు, గ్రామీణ ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణించాల్సి వస్తున్నా వారి కష్టాలను పట్టించుకునే వారు కనిపించడం లేదు.

శుభగృహ వెంచర్ యాజమాన్యం బీటీ రోడ్డును కంకర రోడ్డుగా మార్చారని , రోడ్డంతా గుంతలు, కంకరలతో నిండి ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. చిన్న వాహనాలు, బైక్లు తరచుగా అదుపుతప్పి చాలామంది వాహనదారులు గాయాలపాలయ్యారని, రాత్రి సమయంలో పరిస్థితి మరింత భయంకరంగా మారిందన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం పెరుగుతోందని స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. 

ఈ రోడ్డుపై ప్రయాణం అంటే భయం వేస్తోందని ప్రజలు వాపోతున్నారు. అయితే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం సమస్యను పరిష్కరించకుండా మౌనంగా ఉండడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డును బీటీగా పునరుద్ధరించాలని  ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.