17 July, 2026 | 3:23 PM

బీఆర్‌ఎస్ ఓట్లు ఎటుపాయే?

05-06-2024 01:00 AM

అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి 37.35శాతం ఓట్లు

లోక్‌సభ పోరులో 16.68శాతానికి పడిపోయిన వైనం

హైదరాబాద్, జూన్ 4(విజయక్రాంతి) : లోక్‌సభ ఎన్నికల్లో కనీవినీ ఎరగని రీతిలో బీఆర్‌ఎస్ ఓటమిని చవిచూసింది. బీఆర్‌ఎస్ తన 23ఏళ్ల  రాజకీయ, ఉద్యమ ప్రస్థానంలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన గులాబీ పార్టీ..  ఈ ఎన్నికల్లో 17లోక్‌సభ స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. పైగా 14చోట్ల మూడోస్థానానికి పడిపోయింది.

హైదరాబాద్‌లో ఏకంగా నాలుగో స్థానానికి దిగజారింది. ఖమ్మం, మహబూబాబాద్‌లో మాత్రమే.. రెండో స్థానంలో నిలిచింది. గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 37.35శాతం ఓట్లను రాబట్టుకొని.. 39 స్థానాల్లో గెలిచిన బీఆర్‌ఎస్‌కు ఏమైంది? అసెంబ్లీ పోరులో వచ్చిన ఓట్లు ఎటు పోయాయి? పార్టీని వీడిన వారే బీఆర్‌ఎస్‌ను దెబ్బతీశారా? ఓసారి పరిశీలిద్దాం.

ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎనికల్లో బీఆర్‌ఎస్‌కు రాష్ట్రవ్యాప్తంగా 87,53,924 (37.35శాతం) ఓట్లు వచ్చాయి. మంగళవారం విడుదలైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో 36,34,261ఓట్లకు మాత్రమే వచ్చాయి. అంటే బీఆర్‌ఎస్‌కు 51.19లక్షల ఓట్లు తగ్గాయి. మరి ఈ ఓట్లన్ని ఏ పార్టీకి పోయాయనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. బీఆర్‌ఎస్ ఓట్లలో సింహభాగం బీజేపీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

కారణాలు ఇవే..

బీఆర్‌ఎస్ ఓట్లు భారీగా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ క్రమంగా పట్టుకోల్పోతూ వచ్చింది. పలు నియోజకవర్గాల్లో కీలక నేతలు కాంగ్రెస్ బాట పట్టారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు పెద్దదిక్కు లేకుండా పోయింది. కొన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్ నుంచి వెళ్లిన వారే అభ్యర్థులు కావడంతో గులాబీ క్యాడర్ అంత.. పార్టీ మారిన నాయకుడి వెంట వెళ్లిన పరిస్థితి నెలకొంది.

అలాగే ఇవి జాతీయ స్థాయి ఎన్నికలు కావడంతో.. జాతీయ అంశాలే ఎజెండాగా మారిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ను  ఓటర్లు సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇతర పార్టీలవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. భువనగిరి, మల్కాజ్ గిరి లాంటి చోట్ల బీజేపీ చేసిన సోషల్ మీడియా వ్యూహం బీఆర్‌ఎస్ ఓట్లను భారీగా చీల్చినట్లు తెలుస్తోంది.