17 July, 2026 | 3:00 PM

ఖమ్మంలో కాంగ్రెస్ విజయఢంకా

05-06-2024 01:03 AM

4.62 లక్షల మెజార్టీతో రఘురామిరెడ్డి గెలుపు

ఖమ్మం లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇది రికార్డు..

రెండో స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు

ఖమ్మం, జూన్ 4 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విజయ ఢంకా మోగించారు. తన సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి నామానాగేశ్వరరావుపై 4.62 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి 7,59,603 ఓట్లు సాధించగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు 2,97,592 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి తాండ్రవినోద్‌రావు 1,17,075 ఓట్లు దక్కాయి.

ప్రతి రౌండ్‌లోనూ  కాంగ్రెస్  అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఆధిక్యతే కొనసాగింది. ఖమ్మం లోక్‌స్థానంలో మున్నెన్నడూ లేని విధంగా రఘురామిరెడ్డి 4.67 లక్షల మెజారిటీ సాధించారు. లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదు చేశారు. కలెక్టర్ గౌతమ్ లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత రామసహాయం రఘురామిరెడ్డికి గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు రాగమయి, రాందాస్‌నాయక్, జారే ఆదినారాయణ ఉన్నారు. 

ఖమ్మం ప్రజలకు  రుణపడి ఉంటా..

నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన ఖమ్మం ప్రజలకు రుణపడి ఉంటా. నా కోసం కాంగ్రెస్ శ్రేణులు,  ఎమ్మెల్యేలు, నాయకులు నిస్వార్థంగా శ్రమించారు. వారి సేవలకు వెలకట్టలేను. మంత్రులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. సీపీఎం, సీపీఐ కార్యకర్తలకు ధన్యవాదాలు. భారీ మెజారిటీతో గెలవడం నాపై మరింత బాధ్యతను పెంచింది.

 -రామసహాయం రాఘురామిరెడ్డి