జనగణనలో బీసీ కాలమ్ ఏది?
డైరెక్టర్ భారతి హోళీకేరికి బీసీ కమిషన్ లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతు న్న మొదటి విడత జనగణనలో బీసీలకు సంబంధించిన ప్రత్యేక కాలమ్ లేకపోవడంపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర జనగణన డైరెక్టర్ భార తి హోళీకేరికి బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ గురువారం ఒక లేఖ రాశారు. 2025 ఏప్రిల్ 30న జరిగిన కేంద్ర ప్రభుత్వ రాజకీయ వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో 2027 జనగణనలో బీసీల కుల గణన సేకరించాలని నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కేంద్రం అంగీకరించినప్పటికీ, ఏప్రిల్ 26 నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన మొదటి విడత జనా భా లెక్కల సేకరణలో బీసీల అంశా న్ని విస్మరించడం బీసీ వర్గాలను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని ఆ యన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కమిషన్ ప్రశ్నించగా, కేం ద్ర ప్రభుత్వం రెండో విడత జనాభా సేకరణలో బీసీ వివరాలను సేకరిస్తుందని ప్రాథమిక వివరణ ఇచ్చా రు. అయితే, దీనిపై కేవలం మాటలతో కాకుండా స్పష్టమైన ప్రణాళిక ఉండాలని కమిషన్ డిమాండ్ చేసింది.
తెలంగాణలో ఉన్న బీసీ కులాల జాబితాను డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్‌కు పంపిస్తూ.. రెండో విడతలో ఆయా కులాల వివరాలను ఏ విధంగా నమోదు చేస్తారో సమగ్రంగా వివరించాలని కోరింది. బీసీ కులాల వివరాల సేకరణలో ఎలాంటి గందరగోళం ఉండకూడదని, క్షేత్రస్థాయి లో డేటా సేకరణ పారదర్శకంగా జరగాలని చైర్మన్ నిరంజన్ కోరారు.
ఈ మొత్తం ప్రక్రియపై త్వరలోనే సవివరమైన నివేదికను సమర్పించాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ను బీసీ కమిషన్ ఆదేశించింది. కోట్లాది మంది బీసీల ప్రయోజనాలకు సంబంధించిన ఈ అంశంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఈ సందర్భంగా కమిషన్ కోరింది






