calender_icon.png 6 February, 2026 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న వడ్ల బోనస్ డబ్బులెక్కడా?

06-02-2026 12:28:08 AM

  1. రెండు నెలలు గడిచినా రైతుల ఖాతాల్లో జమ కాని బోనస్ డబ్బులు

బ్యాంకులు  కొనుగోలు కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న రైతులు

సాగు ఖర్చులు పెరిగి,బోనస్ రాక దిక్కుతోచని పరిస్థితి

వెంటనే బోనస్ అందించాలని రైతుల వేడుకోలు

రూ.7.36 కోట్ల బోనస్‌పై స్పష్టత లేని దుస్థితి

ఇంకా ఎన్ని కోట్లరూపాయలు జమ కావాల్సి ఉందో తెలియని పరిస్థితి

చివ్వెంల, ఫిబ్రవరి 5: సన్నవడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులు ఇప్పటివరకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.యాసంగి సీజన్లో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో బోనస్పు ఆశ పెట్టుకున్న రైతులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ప్రభుత్వం మొదటగా ధాన్యం విక్రయించిన రైతులకు వడ్ల బిల్లులతో పాటు బోనస్ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేసినప్పటికీ,ధాన్యం విక్రయించిన రైతులకు మాత్రం రెండు నెలలు గడిచినా బోనస్ జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివ్వెంల మండలంలో ఏర్పాటు చేసిన 13 సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1,47,239.6 క్వింటాళ్ల సన్నధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

దీనికి సంబంధించి రూ.7 కోట్ల 36 లక్షల19వేల 800 బోనస్ రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని రైతులు ఆరోపిస్తున్నారు.తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు,బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. సాగు అప్పులు, వడ్డీలు, కుటుంబ ఖర్చులు తలకెక్కుతున్న వేళ బోనస్ రాక రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి సన్నవడ్లు పండించిన రైతుల ఖాతా ల్లో బోనస్ డబ్బులు వెంటనే జమ చేయాలని రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

 సమాచారం లేదంటున్న మండల అధికారులు

చివ్వెంల మండలంలో సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్ డబ్బుల అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది.రైతుల భవిష్యత్తుతో ముడిపడిన కీలక అంశంపై సంబంధిత అధికారులకే స్పష్టత లేకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బోనస్ డబ్బులపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోతే ఆందోళనలు చేపడతామని పలువురు రైతులు హెచ్చరిస్తున్నారు.

బోనస్ వెంటనే విడుదల చేయాలి

ప్రభుత్వం ప్రకటించిన బోనస్పు నమ్మకంతోనే సన్నవడ్లు పండించాం.రెండు నెలలు గడిచినా డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బోనస్ విడుదల చేయాలి.

 రైతు పుట్ట లింగస్వామి

వివరాలు అందుబాటులో లేవు 

మండలంలో ఎంతమంది రైతులకు బోనస్ జమ అయ్యిందనే వివరాలు మా వద్ద అందుబాటులో లేవు.మా వంతుగా సన్న వడ్లు పండించిన రైతులందరికీ బోనస్ డబ్బులు వేయించడానికి ప్రయ త్నం చేస్తున్నాం. ప్రభుత్వం డబ్బు లు విడుదల చేయగానే రైతుల ఖాతాల్లో జమ చేయడానికి కృషి చేస్తాం.

 వెంకయ్య (ఏపీఎం చివ్వెంల)