6 May, 2026 | 1:22 PM

విగ్రహ ఏర్పాటుపై రాద్ధాంతం సరికాదు

10-12-2024 02:43 AM

విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆగ్రహం 

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై బీఆర్‌ఎస్ నేతలు రాద్ధాంతం చేయడం సరికాదని విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గడీల్లోని దొరసానులే నగలు, వడ్డాణం పెట్టుకుని బయటికి వచ్చేవారని పేర్కొన్నారు. సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అదానీ, సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలున్న టీ షర్టు లు వేసుకుని అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు.

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో మేఘా కృష్ణారెడ్డితో అంటకాగడమే కాకుండా.. ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో 60 శాతం పూర్తయిన ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టి.. కాళేశ్వరం ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారని మండిపడ్డారు.

కాళేశ్వరానికి అవసరం లేకున్నా ధర్మపురి నియోజకవర్గంలో వెయ్యి ఎకరాలు సేకరించారని, రైతులకు డబ్బులు కూడా తక్కువే ఇచ్చారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో మంత్రులకు కూడా కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, సీఎం రేవంత్‌రెడ్డి సామాన్యులను కూడా కలిసి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు.