11-09-2024 01:07:07 AM
అసెంబ్లీ నిబంధనల ప్రకారమే పీఏసీ చైర్మన్ నియామకం
స్పీకర్ అధికారాలనే తప్పుబట్టే విధంగా బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలు
పీఏసీ పదవిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకే ఇచ్చినట్లు నమ్ముతున్నాం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్,సెప్టెంబర్ ౧౦ (విజయక్రాం తి): పీఏసీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ నియామకంలో బీఆర్‌ఎస్ నేతల మాటలు చూస్తుం టే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంద ని, వారు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హితవు పలికారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోయామన్న బాధలో బీఆర్‌ఎస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఖూనీ అయిందని ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అసెంబ్లీ నిబంధనల ప్రకారమే పీఏసీ చైర్మన్ నియామకం చేపట్టారని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు స్పీకర్ అధికారాలనే తప్పుబట్డడం సరికాదని హితవు పలికారు. స్పీకర్ పదవిని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని దునుమాడారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ భ్రష్ఠు పట్టించిందని మండిపడ్డారు.
నాడు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని గుర్తుచేశారు. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను సైతం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దక్కకుండా చేశారని గుర్తుచేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన వాళ్లే నేడు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టు తీర్పుపై మీడియా మంత్రిని ప్రశ్నించగా.. హైకోర్టు తీర్పును తమ ప్రభుత్వం స్వాగతిస్తోందన్నారు. తీర్పు కాపీని పూర్తిగా ఆధ్యయనం చేశాక పార్టీ పరంగా ఎలా వ్యవహారించాలో నిర్ణయిస్తామన్నారు. వ్యక్తులపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రతిఒక్కరూ వ్యవస్థను గౌరవించాల్సిందేనన్నారు.
మీలో మీకే బేదాభిప్రాయాలుంటే మాకేం సంబంధం?
పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ సైతం తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్లుగా ప్రకటించారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు, ఎమ్మెల్యే గాంధీకి మధ్య సఖ్యత లేకుంటే తమ పార్టీకేం సంబంధమని ప్రశ్నించారు. అవన్నీ బీఆర్‌ఎస్ అంతర్గత వ్యవహారాలని స్పష్టం చేశారు. అంతేగానీ కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రశ్నించే హక్కు బీఆర్‌ఎస్ నేతలకు లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ల నాటకమాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలపై మంత్రి స్పందిస్తూ.. బీఆర్‌ఎస్‌ను ఇప్పటికే ప్రజలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తిరస్కరించారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం మెండుగా ఉందని ధీమావ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎవరైనా పార్టీలోకి వస్తామంటే వారిని స్వాగతిస్తామని స్పష్టం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ఇప్పుడు స్పందించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనర్హతపై కాల పరిమితిలో నిర్ణయాలు తీసుకోవాలని 10వ షెడ్యూల్‌లో ఎక్కడా లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు, సమాజం కోరుకునే విధంగా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని, పరిపాలన బాగుందని విపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతామంటే తాము వద్దనబోమని కుండబద్దలు కొట్టారు.