17-07-2025 12:00:00 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివక్ష, అవమానం, అణచివేతకు తెలంగాణ ప్రాంతం గురవుతున్నదనే భావన జగపతిరావులో ఉండేది. ఏపీలో హైదరాబాద్ స్టేట్‌ను కలిపే ముందు రాసుకున్న ఒప్పందాలు అమలుకు నోచుకోకపోవడంతో జగపతిరావు రగిలిపోయేవారు. పెద్ద మనుషుల ఒప్పందం, ఆరుసూత్రాలు, అష్ట సూత్రాలు వంటి ఒప్పందాలు అమలు కావాలంటే తెలంగాణ శాసనసభ్యులందరం ఒకే వేదిక మీదకు రావాలని నిర్ణయించుకున్నారు. దీంతో 1991లో తెలంగాణ శాసన సభ్యుల ఫోరం ఏర్పాటైంది. ఈ ఫోరం ఏర్పాటులో జగపతిరావు పాత్ర అమోఘం.
నీతి నిజాయతీకి మారుపేరు.. ము క్కు సూటి నేత.. ఎవరికీ తలవంచని నైజం.. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా నేనునాన్నంటూ భరోసానిచ్చేవారు.. ఎమ్మెల్యేగా కరీంనగర్‌ను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దినవారు.. కరీంనగర్ ప్రజలు ఇప్పటికీ టైగర్ అని పిలుచుకునేది.. ఆయనెవరో కాదు.. మహానేత, తెలంగాణ ఉద్యమకారుడు.. కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది వెలిచాల జగపతిరావు.
ఏ పదవి చేపట్టినా ప్రణాళిక, క్రమశిక్షణతో పనిచేస్తూ ఆ పదవికే వన్నెతెచ్చారు. జగపతిరావుకు ఉమ్మడి కరీంన గర్‌తో వీడదీయ లేని బంధం ఉంది. నేడు ఆయన జయంతి.. 2022, అక్టోబర్ 19న జగపతిరావు మరణించినా, ఆయన చేసిన అభివృద్ధి, మంచి పనులు ప్రజల మదిలో పదిలంగా ఉన్నాయి. జగపతిరావు జయంతిని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకులు, ఆయన శిష్యులు, అభిమానులు ఏర్పాట్లు చేశారు.
1970 నుంచే ప్రజా సేవలో..
1935లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండిలో జన్మించిన వెలిచాల కు ఇద్దరు కుమారులు వెలిచాల రవీందర్‌రావు, వెలిచాల రాజేందర్‌రావు, కూతురు శోభ ఉన్నారు. వెలిచాల రాజేందర్‌రావు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తున్నారు. జగపతిరావు 1970 నుంచే ప్రజాసేవలో నిమగ్నమయ్యారు.
గుండి గ్రామ సర్పంచ్‌గా పని చేసి ఎనలేని సేవలందించారు. గుండి సహకార సంఘం చైర్మన్‌గా, గంగాధర సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1972 వరకు ఉమ్మడి రాష్ర్టం లో రాష్ర్ట మార్క్ ఫెడ్ చైర్మన్‌గా సేవలందించారు. 1972లో జగిత్యాల నుంచి కాం గ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. 1978- వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పని చేశారు.
1989లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించినా అవకాశం దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పార గుర్తుపై గెలిచి సంచలనం సృష్టించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా తెలంగాణ లెజిస్ట్రేచర్స్ ఫోరం కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించా రు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపట్టి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జగపతిరావు కవిగా కూడా సుపరిచితులు. తెలంగాణ స్వరా ష్ర్టం కోసం జరిగిన పోరాటంలో కీలకపాత్ర పోషించారు.
పెద్దఎత్తున ఉపాధి కల్పన..
మార్క్ ఫెడ్ చైర్మన్‌గా పని చేసిన కాలం లో జగపతిరావు కరీంనగర్‌లో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. 2017లో అప్ప టి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి తన భార్య వెలిచాల సరళాదేవి పేరిట రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. కరీంనగర్‌లోని తన ఇంటి వద్ద ప్రత్యేకంగా 5 వేల పూల మొక్కలతో బొటానికల్ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.
పట్టణంలో తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తీర్చేందుకు జగపతిరావు ప్రత్యే కంగా రాంనగర్, అంబేద్కర్ నగర్, కోర్టు చౌరస్తా, కోతి రాంపూర్‌లో నాలుగు వాట ర్ ట్యాంకులు, ఫిల్టర్ బెడ్ల నిర్మాణానికి కృషి చేశారు. తెలంగాణ విముక్తి కోసం నిజాం రజాకార్ల చేతిలో తొలి అమరుడైన ఆనభేరి ప్రభాకర్‌రావు విగ్రహాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయిం చారు. విద్యుత్ కష్టాలను తీర్చేందుకు కరీంనగర్ వద్ద 220 కేవీ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేయించారు.
జగపతిరావు ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, బుగ్గారం, కరీంనగర్ స్థానాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి రెండు సార్లు గెలిచారు. కరీంనగర్ నియోజవర్గ ప్రజలు తాగునీటికి నానా కష్టాలు పడగా, చలించిపోయిన జగపతిరావు, నియోజకవర్గవ్యా ప్తంగా ఊరికో మంచినీటి ట్యాంకు నిర్మా ణం చేపట్టాలని సంకల్పించారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి ఊరూరా ట్యాంకులు కట్టించారు.
తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం ఏర్పాటులో ప్రధానపాత్ర..
1989లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర ఎమ్మెల్యేగా జగపతిరావు గెలుపొందిన సమయంలోనే తెలంగాణ శాసనసభ్యుల ఫోరానికి అంకురార్పణ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివక్ష, అవమానం, అణచివేతకు తెలంగాణ ప్రాం తం గురవుతున్నదనే భావన జగపతిరావు లో ఉండేది. ఏపీలో హైదరాబాద్ స్టేట్‌ను కలిపే ముందు రాసుకున్న ఒప్పందాలు అమలుకు నోచుకోకపోవడంతో జగపతిరావు రగిలిపోయేవారు.
పెద్ద మనుషుల ఒప్పందం, ఆరుసూత్రాలు, అష్ట సూత్రా లు వంటి ఒప్పందాలు అమలు కావాలం టే తెలంగాణ శాసనసభ్యులందరం ఒకే వేదిక మీదకు రావాలని నిర్ణయించుకున్నారు. దీంతో 1991లో తెలంగాణ శాసన సభ్యుల ఫోరం ఏర్పాటైంది. ఈ ఫోరం ఏర్పాటులో జగపతిరావు పాత్ర అమో ఘం. జానారెడ్డి, జువ్వాడి చొక్కారావు, పీ నర్సారెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి, ఎం బాగారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎం నారాయణరెడ్డి, ఎం సత్యనారాయణరావు, ఎన్ ఇంద్రసేనారెడ్డి, సీహెచ్ విద్యాసాగర్‌రావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వంటి భిన్న పార్టీల సభ్యులు తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పాటుకు సహకరించారు.
ఆ సయయంలో ఫోరం కన్వీనర్‌గా జగపతిరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యుల సహకారంతో తెలంగాణ ప్రాంత హక్కులు, రక్షణ, నీళ్లు, నిధుల్లో వాటాల కోసం పోరాడారు. సాగునీటి పంపకంలో తెలంగాణ పట్ల వివక్షను ఫోరం తీవ్రంగా నిరసించింది. నాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం తెలంగాణ శాసనసభ్యుల ఫోరం చేసిన పోరాట ఫలితంతోనే దేవాదుల, నెట్టెంపాడు, తుపాకులగూడెం, కల్వకుర్తి ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమకాలువ, కరీంనగర్ వరద కాలువ పథకాలు మొదల య్యాయి.
పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా అనేకమార్లు తెలంగాణ వాటాలో వివక్షపై జగపతిరావు ప్రస్తావించేవారు. జగపతిరావు కవి, సాహితీవేత్త. లోతైన అధ్యయనం చేసి, తన కవిత్వం.. రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. 2022, అక్టోబర్ 19వ తేదీన జగపతిరావు తుది శ్వాస విడిచారు. తుది శ్వాసవిడిచే వరకు విశ్రమించని నేత. పేదల లీడర్‌గా పేరు గడించారు. నేడు జగపతిరావు జయంతి.. ఇదే ఆ మహానేతకు మనం అర్పించే ఘననివాళి.
వ్యాసకర్త: 9441884389