22 August, 2026 | 8:50 AM

సీఎంపై ఫిర్యాదు ఎందుకు?

12-06-2024 01:51 AM

ఓయూ విద్యార్థుల పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): వేసవి సెలవుల నకిలీ సర్క్యులర్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు జరుగుతున్నం దున అదే వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డిపై కొత్తగా కేసు ఎందుకు నమోదు చేయాలని ఉస్మానియా విద్యార్థులను హైకోర్టు ప్రశ్నించింది. ప్రతి కేసులోనూ ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేస్తూ పోతే ఎలా? అని నిలదీసింది. గత వేసవి సెలవుల సర్క్యులర్‌ను మార్చి ట్వీట్ చేసిన సీఎం  రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం డిస్మిస్ చేసింది.

ఈ అంశంలో చట్టపరమైన ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించింది. సీఎం రేవంత్‌రెడ్డి నకిలీ సర్క్యులర్‌ను ప్రచారం చేసినందుకు చర్యలు తీసుకోవాలని మే 1న, 4న ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఓయూ విద్యార్థి సీహెచ్ దశరథ్ మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారించారు. వాదనల తర్వాత పిటిషన్‌ను కొట్టివేశారు.