28 April, 2026 | 2:19 AM

ఆమ్ ఆద్మీ పార్టీలో అస్తిత్వ సంక్షోభం

28-04-2026 12:00 AM

దుప్పటి మొగిలి :

భారత ప్రజాస్వామ్యం ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వాన్ని, భిన్నమైన భావజాలాలను ఆహ్వానిస్తూ ముందుకు సాగుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన రాజకీయాలు ఎన్నో మార్పులకు లోనయ్యాయి. ఒకప్పుడు సిద్ధాంతాల కోసం సాగిన పోరాటం, కాలక్రమేణా సంక్షేమ పథకాల పోటీగా మారింది. ప్రతి దశలోనూ ఒక కొత్త తరం వచ్చి, సరికొత్త ఆశలను చిగురింపజేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే 2011-12 మధ్య అన్నా హజారే నాయకత్వంలో సాగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశాన్ని కుదిపేసింది.

రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే బలమైన కోరికతో 2012 నవంబర్ 26న అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆవిర్భవించింది. సామాన్య మానవుడు పాలనలో భాగం కావాలనే ఆశయం యువతను విశేషంగా ఆకర్షించింది. మనీష్ సిసోడియా, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వంటి మేధావులు పారదర్శకత, నైతికత అనే విలువలతో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టా రు. రాఘవ్ చద్దా వంటి యువ నాయకులు ఆప్ పారదర్శక పాలనపై నమ్మకంతో ముం దుకువచ్చారు.

వారి మాటలు కొత్త రాజకీయాలకు మార్గం చూపుతాయని ప్రజలు ఆశించారు. దీని ఫలితంగానే 2015, 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అనూహ్య విజయాన్ని సాధించింది. 2022లో పంజాబ్‌లో సాధించిన విజయం ఆప్‌ను జాతీయ పార్టీగా నిల బెట్టింది. అయితే, ఒక ఉద్యమం రాజకీయ పార్టీగా మారినప్పుడు దాని విలువలు మారుతాయా? అనే సందేహం ప్రజల్లో మొదలైంది. పా

ర్టీలో అంతర్గత విభేదాలు, అవినీతి ఆరోపణలు, ముఖ్య నాయకుల వలస లు ఆప్‌ను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టా యి. 2015లో యోగేంద్ర యాదవ్, ప్రశాం త్ భూషణ్ వంటి వారిని తొలగించడం పార్టీలోని ప్రజాస్వామ్యంపై విమర్శలకు దారితీసింది. అధికారం కేంద్రీకతమవుతోందని, భిన్నాభిప్రాయాలను అణచివేస్తున్నార నే ఆరోపణలు వెల్లువెత్తాయి.

కుదిపేసిన లిక్కర్ కేసు

2022-24 మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన ఢిల్లీ మద్యం కేసు ఆప్ ప్రతిష్ఠను భారీగా దెబ్బతీసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల అరెస్టులు, కోర్టు విచారణలు ప్రజల్లో అనుమానాలను పెంచాయి. అవినీతిని అంతం చేస్తామని వచ్చిన పార్టీ, అదే ఆరోపణల్లో చిక్కుకోవడం రాజకీయ విరోధాభాసంగా మారింది. యువతకు ఆదర్శంగా నిలిచిన రాఘవ్‌చద్దా వంటి నాయకులు కూడా ఈ పరిస్థితుల్లో పార్టీకి దూరం కావడం విశేషం. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన చద్దా, తన స్పష్టమైన ప్రసంగాలతో జెన్‌జీ తరానికి ప్రతి నిధిగా గుర్తింపుపొందారు.

కానీ, పార్టీ ఆదేశాలను పట్టించుకోవడం లేదనే కారణంతో ఆయన్ను కీలక పదవి నుంచి తొలగించడం తో వివాదం ముదిరింది. ఆప్ తన అసలు ఆశయాలను విస్మరించి, వ్యక్తుల స్వార్థం కోసం నడుస్తోందని విమర్శిస్తూ ఆయన బీజేపీలో చేరారు. సోషల్ మీడియా సాయంతో రాత్రికి రాత్రే ఇమేజ్‌ను సష్టించుకునే ‘జెన్ జీ’ నాయకత్వంపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది. సాంకేతికతకు దగ్గరగా ఉం టూ, యువతతో కనెక్ట్ అయ్యే నాయకులు సత్యం కోసం, ప్రజల కోసం పోరాడుతారని అందరూ భావించారు.

కానీ, రాఘవ్ చద్దా తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివద్ధి చెందుతున్నదని, తాను అందులో భాగస్వామిని కావాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మార్పును ఆయన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన బీజేపీలో చేరిన తర్వాత ఇన్‌స్టాగ్రాం నుంచి లక్షలాది మంది అనుచరులు తొలగిపోవడం ప్రజల అసంతృప్తికి నిదర్శనం. సిద్ధాంతాల కంటే అధికార మే ముఖ్యం అనుకోవడం ప్రజల్లో రాజకీయాలపై విరక్తి కలిగిస్తోంది.

పక్కాగా బీజేపీ వ్యూహం

విపక్షాలను బలహీనపరిచి తన శక్తిని పెంచుకోవాలనే బీజేపీ వ్యూహం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడం ద్వారా జాతీయ స్థాయి లో తిరుగులేని ఆధిపత్యం సాధించాలని బీజేపీ భావిస్తోంది. అయితే, బలమైన ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం బలహీనపడుతుం ది. నాయకులు తమపై ఉన్న కేసుల నుంచి బయటపడటానికో లేదా పదవుల కోసమో పార్టీలు మారడం సామాన్య ఓటరును అయోమయానికి గురిచేస్తున్నది.

రాను రాను రాజకీయాలు సేవగా కాకుండా వ్యాపారంగా మారుతున్నాయనే విమర్శలు విని పిస్తున్నాయి. రాఘవ్ చద్దాతో పాటు పంజా బ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఆరుగురు రాజ్యసభ సభ్యులు కూడా పార్టీని వీడటం ఆప్ మనుగడను ప్రశ్నార్థకం చేసిం ది. కేజ్రీవాల్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న చద్దా కమలం గూటికి చేరడం భారత రాజకీయాల్లో ఒక సంచలనం. ఆప్ మద్దతుదా రులు దీనిని నమ్మకద్రోహంగా భావిస్తుంటే, మరికొందరు కేజ్రీవాల్ నియంతృత్వ ధోరణే దీనికి కారణమని విమర్శిస్తున్నారు.

పదిహేనేళ్ల క్రితం అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ, ఇప్పుడు అదే ఊబిలో కూరుకుపోవడం విచారకరం. రాఘవ్ చద్దా వంటి యువ నేతల నిష్ర్కమణ పంజాబ్ రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవ కాశం ఉంది. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, ఈ పరిణామాలు భగవంత్ మాన్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. ఆశయాల పునాదిపై పుట్టిన ఆప్, ఇప్పుడు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడాల్సిన స్థితికి చేరుకుంది.

కార్పొరేట్ తరహా ఎత్తుగడలు

ఆమ్ ఆద్మీ పార్టీలో సంప్రదాయ రాజకీయ శైలి ప్రవేశించడం ఆ పార్టీ మౌలిక సిద్ధాంతాలకు పెద్ద సవాల్‌గా మారింది. ప్రారంభంలో స్వచ్ఛంద సేవకులు, సామా న్య కార్యకర్తలే బలమని చెప్పుకొన్న పార్టీ.. కాలక్రమేణా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు పెద్దపీట వేయడం మొదలుపెట్టింది. దీనివల్ల ఉద్యమ కాలం నుంచి ఉన్న నిబద్ధత గల కార్యకర్తలు క్రమంగా దూరం అవుతున్నారు. పార్టీ నిర్ణయాల్లో పారదర్శకత తగ్గిందనే విమర్శలు అంతర్గతంగా బలంగా వినిపిస్తున్నాయి.

కేవలం గెలుపు గుర్రాల కోసమే ప్రాధాన్యమివ్వడం వల్ల సిద్ధాంతపరమైన పార్టీ పునాదులు కదులుతున్నాయి. ఎన్నికల నిర్వహణలో కార్పొరేట్ తరహా వ్యూహాలను అనుసరించడం వల్ల సామాన్య ప్రజలతో ఉన్న అనుబంధం సన్నగిల్లుతున్నది. ఈ పరిణామాలు పార్టీపై నమ్మకంతో వచ్చిన సామాన్య ఓటరును అయోమయానికి గురిచేస్తున్నాయి.

నాయకత్వం తన స్వభావాన్ని మార్చుకోకపోతే రాజకీయ మనుగడ కష్టంగా మారుతుందనే హెచ్చరికలు వస్తున్నాయి. అగ్ర నాయకత్వంపై కేసులు వల్ల పార్టీలో స్తబ్దత ఏర్పడింది. పార్టీలో ఉన్నతస్థాయి వ్యక్తులు జైలు నుంచి పాలన సాగించాల్సి రావడం ప్రజాస్వామ్య వ్యవస్థలో నైతిక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. రాజకీయాల కంటే కోర్టు కేసులు, దర్యాప్తు సంస్థల విచారణల చుట్టూనే పార్టీ సమయమంతా వృథా అవుతున్నది. 

వ్యాసకర్త సెల్: 84668 27118