వందేమాతరంపై ఎందుకీ రగడ?
ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక తెస్తుంది. అలాగే భావోద్వేగాన్ని మేలుకొల్పే ఒక్కొక్క గీతిక నిలువెల్లా తనువును పులకరింపజేస్తుంది. పదిమంది కలిసి పాడినప్పుడు.. తమ అందరి గుండెలయ ఒక్కటేనని అనిపిస్తుంది. పదం పదం కలసిపాడటమే కాదు, కదం కదం కలిపి తామంతా నడువగలమని, ఏ పనినైనా సాధించగలమనే విశ్వాసాన్ని ప్రోదిచేస్తుంది. దేశమాత పట్ల భక్తిభావాన్ని, కర్త్యవం పట్ల నిష్ఠను, నరనరానికి, కణకణానికి వ్యాపింపజేయటంలో సంగీతానికి గల శక్తి అసామాన్యమైనది. అందుకే 1875లో బంకించంద్రుడు రాసిన వందేమాతర గీతం తర్వాతి కాలంలో కోట్లాది మంది భారతీయుల గొంతుకగా మారింది. భారత స్వాతంత్య్ర పోరాటంలో సమరశంఖ నాదమయ్యింది.
అధ్వరణ వేదంలోని పృథ్వీ సూక్తంలో భూమిని తల్లిగా.. ఆ భూమిపై నివసించేవారిని ఆమె పుత్రులుగా అభివర్ణించారు రుషులు. మాతా భూమిః పుత్రోహంపృథివ్యాః! అంటే ఈ పుడమి నా తల్లి.. నేను ఆమె పుత్రుడను! ఈ భావన భారతీయ సంస్కృతిలో భాగం. ఈ సంస్కృతే బంకించంద్రుని రచనల్లో కనిపిస్తుంది.
భారత దాస్యానికి ఆంగ్లేయులతోపాటు దేశ భక్తిలేని భారతీయులు కూడా ఓ కారణమనేది బంకించంద్రుని అభిప్రాయం. భారతీయులలో నెలకొన్న నిరాశను తొలగించి మాతృభూమి కోసం సర్వస్వాన్ని సమర్పించే విధంగా వారిని తీర్చిదిద్దటం చాలా అవసరమని ఆయన భావించారు. ఇలా తీర్చిదిద్దాలంటే అందరిలో దేశభక్తిని, మాతృభూమి పట్ల ప్రేమను నింపాలి. దైవం తర్వాత మాతృభూమికే ప్రాముఖ్యత ఇవ్వాలనే భావనతో వందేమాతరం అనే గీత రచనకు ఆయన సంకల్పించారు. 1875 నవంబర్‌లో వందేమాతర గీతం ఆయన కవితారూపంలో ఆవిష్కృతమైంది. కర్తవ్య నిర్వహణకు కావలసిన జ్ఞానం, దాని కోసం కష్టపడే సంసిద్ధత, ధ్యేయం సాధించి తీరుతాననే ఆత్మవిశ్వాసం ఈ గీతంలో ప్రతిబింబించాయి.
ఆరు చరణాలున్న ఈ గీతంలో సంస్కృ త పదాలతో పాటు కొన్ని బెంగాళీ భాషా పదాలున్నాయి. 1875లోనే ఆయన సంపాదకత్వంలో ప్రచురితమయ్యే బంగ దర్శన్ పత్రికలో ఈ గీతం ప్రచురితమైంది. బంగ దర్శన్ పత్రికలో 1880- మధ్యకాలం లో ఆనందమఠ్ నవలను ధారావాహికగా ప్రచురించారు. ఈ నవలలో వందేమాతర గీతాన్ని యథాతథంగా పొందుపర్చారు. ఆనందమఠ్ నవలలో ఆ గీతాన్ని పాడుతూ భవానందుడు... ‘మాకు తల్లి లేదు, తండ్రి లేడు, అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు లేరు. భార్యాబిడ్డలు లేరు, ఇల్లూ వాకిలీ లేదు. మాకున్నదొక్కటే... సుజల, సుఫల, సస్యశ్యామల అయిన భారత మాతయే. మేమంద రం ఆమె సంతానం!’ అని అంటాడు. తర్వాతి కాలంలో ఈ వందేమాతరమే స్వతంత్ర సాధానాయజ్ఞానికి తారక మంత్రమైంది.
కులం, భాష, ప్రాంతం, తెగలు అనే బేధా లు లేకుండా దేశ ప్రజలందరూ ఒక్కటిగా ఈ గీతాన్ని గానం చేశారు. ఇది భారతీయ ఏకాత్మతను సాక్షాత్కరింపజేసిన గీతం! పుడమి తల్లి జయగానం చేస్తూ నేలకొరిగిన వేలాది భారత పుత్రులకు ఇది ప్రేరణ స్రోతస్సు. మదాంధకారంతో నిదురపోతున్న ఆంగ్లేయులను ఉలిక్కిపడేలా చేసిన శరాఘాతం, ఆబాలగోపాలం పెదవులపై తొణకిలాడిన స్వరాజ్య గానం వందేమాతరం.
వందేమాతర గీతంలో కాని, నినాదంలో కాని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఏమీ లేదు. అయినా బ్రిటీష్ ప్రభుత్వం వణికిపోయింది. ఇది మామూలు భక్తి గీతం కాదు. ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆవేశపూరితం చేసిన గీతం! ముఖ్యంగా భారతీయ యువతను ఊపేసిన గీతం! నవ్వుతూనే తమ జీవితాలను భారతమాత చరణాల వద్ద సమర్పించగల మనోధైర్యాన్ని ఇది యువతకు అందించింది. అయితే, 1876లోనే యదునాథ భట్టాచార్య అనే కవి మల్హార్ రాగంలో ఈ గీతాన్ని తొలిసారిగా పాడారు. 1882లో ఆనందమ ఠ్ నవల పుస్తక రూపంలో ప్రచురితమైంది. అప్పుడు ఈ గీతానికి మరింత ప్రాచుర్యం వచ్చింది. 1885లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ దేశీరాగంలో వందేమాతర గీతాన్ని స్వరబద్ధం చేశారు.
1896లో కాంగ్రెస్ మహాసభలు కలకత్తాలో జరిగాయి. ఈ సమావేశాల ప్రారంభంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దేశీరాగంలోనే మరోసారి వందేమాతర గీతం పాడారు. కాంగ్రెస్ సభలలో వందేమాతరం పాడటం అప్పటి నుంచే ప్రారంభమైంది.
1905 జూలై 20న బ్రిటీష్ ప్రభుత్వం బెంగాల్‌ను విభజించింది. బెంగాల్ విభజనను వ్యతిరేకించే ఉద్యమంలో వందేమాత ర నినాదం ప్రజలందరికి ఒక ఆయుధంగా మారింది. 1905 ఆగస్టు 7 నాటి చారిత్రాత్మక సమావేశంలో వందేమాతర నినాదాన్ని స్వాతంత్య్రోద్యమ పోరాటానికి పొలికేకగా రూపొందించారు. స్వదేశీ ఆత్మ వందేమాతరమని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అనడానికి కారణం కూడా ఇదే. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం ఈ నినాదాన్ని చూసి వణికిపోయింది. వందేమాతరం గీతం, వందేమాతర నినాదం భారతీయుల్లో, ముఖ్యంగా యువతలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని పెంచుతోందని గ్రహించిన బ్రిటీష్ ప్రభుత్వం దీనిపై నిషేధాన్ని విధించింది.
ఈ నిషేధం భారతీయుల్లో మరింత పట్టుదలను పెంచింది. బెంగాల్‌లో చిన్నగా ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం క్రమంగా మరికొన్ని ప్రాంతాలకు విస్తరించింది. బ్రిటీష్ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా యువతలోని భావోద్వేగాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఎందరో యవకులు వందేమాతరం అంటూ ఉరికంబమెక్కారు. బెంగాల్‌లో రాజుకున్న వందేమాతర ఉద్యమం దేశ ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసింది. దీంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు జాతీయ నాయకులు రంగంలోకి దూకారు. బిపిన్ చంద్రపాల్ వంగ దేశం నుంచి మొదలుపెట్టి మద్రాసు వరకు పర్యటించి ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.
ఖిలాఫత్ ఉద్యమ సమయంలో హిందూ,- ముస్లిం అనే తేడా లేకుండా అందరూ వందేమాతరాన్ని కలిసి పాడారు. అప్పుడు మైనారిటీ నాయకులు ఎవరు వందేమాతరం గీతాన్ని వ్యతిరేకించలేదు. షోలాపూర్ కేసులో అరెస్టయిన ఖుర్బాన్ హుసేన్ ఉరికంబమెక్కుతూ ఆవేశంగా వందేమాతర గీతం పాడారు.
అయితే, కాలక్రమంలో కొంతమంది నేతలు వందేమాతర గీతాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. వందేమాతర గీతంపై కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆంగ్లేయుల పంథాలోనే ఆలోచనలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వందేమాతర గీతానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం సరికాదని ఈ నేతలు భావించారు. నాడు కాంగ్రెస్ మహాసభల్లో ఈ గీతాన్ని పాడకుండా నిరాకరించడంపై విమర్శలు ఉన్నాయి.
వాస్తవానికి 1923 కంటే ముందే కాంగ్రెస్ ప్రతి సమావేశంలోనూ వందేమాతరాన్ని పాడేవారు. ఆ తర్వాత కొంతమంది కాంగ్రెస్ నేతలు మాత్రం నెమ్మదిగా సంతుష్టీకరణ విధానాలను అమలు చేశారు. ఈ సంతుష్టీకరణ విధానంలో భాగంగా మొదటి రెండు చరణాలను మాత్రమే పాడటాన్ని ప్రోత్సహించేవారు. ఇది 1937 నుంచి ప్రారంభమైంది. భారత రాజ్యాంగం కూడా జాతీయ గేయంగా గుర్తించిన వందేమాతరంపై ఇప్పటికీ మన నేతలు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు.
మోదీ ప్రభుత్వం వందేమాతరం ఆరు చరణాల సంపూర్ణ గీతం పాడాలని ప్రొటోకాల్‌ను ఇటీవల తీసుకురావడం అభినందనీయం. జనగణమన జాతీయ గీతానికి ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో.. వందేమాతర గీతానికి కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. అయినప్పటికీ, దేశంలో అక్కడక్కడ ఇంకా కూడా కొందరు వందేమాతరం పూర్తి గీతాన్ని పాడేందుకు నిరాకరిస్తూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో వందేమాతర గీతాన్ని పూర్తిగా ఆలపించేందుకు సోనియాగాంధీ నిరాకరించారని బీజేపీ విమర్శలు చేసింది.
ఏదేమైనా 1857 మొదటి స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత భారతజాతి తిరిగి పుంజుకుని ఆంగ్లేయులను ఎదిరించిన మహత్తర ఉద్యమం వందేమాతర ఉద్యమమే! ఈ ఉద్యమం తర్వాత భారత స్వాతంత్య్ర సం గ్రామం వెనుదిరిగి చూడలేదు. వందేమాత ర సంపూర్ణ గీతం నూతన స్వాతంత్య్ర సమర మంత్రమై ప్రజలను ఉత్తేజపరిచింది. యువతలో స్ఫూర్తి నింపింది. ప్రతి భారతీయుడు స్వగర్వంగా పాడుకోవాల్సిన గీతం వందేమాతరం. ఇప్పటికైనా సంతుష్టీకరణ విధానాలకు పాల్పడేవారు తమ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
వ్యాసకర్త: జర్నలిస్టు, 9908621089
వనకళ్ల వీరప్ప






