19 August, 2026 | 1:35 AM

సూత్రాధ్యక్షుని బాధ్యతలు!

19-08-2026 12:00 AM

సూత్రాధ్యక్షః సూత్రవర్మ వస్త్రరజ్జు

వ్యవహారం తజ్జాతపురుషైః కారయేత్!

(కౌటిలీయం

కౌటిలీయం రెండవ అధికరణం ఇరువది మూడవ అధ్యాయంలో ఆచార్య చాణక్య సూత్రాధ్యక్షుని బాధ్యతలను గురించి వివరించారు. సూత్రాధ్యక్షుడు (పత్తి, దారాలు, వాటితో తయారయ్యే వస్తువులు, తాళ్లు మొదలైన వాటి ఉత్పత్తి, వాటి వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి) పత్తి, దారం, దారంతో చేసిన వస్త్రాలు, కవచాలు, తాళ్లు, వీటి వ్యవహారాలను ఆయా వస్తువుల తయారీలలో మంచి నైపుణ్యం గలిగిన వారితో చేయించాలి అంటాడు. అలాగే జనపనార, పేప, వెదురు బెరళ్లతో గట్టితాళ్లు పేనించాలి, అంటున్నాడు చాణక్య. వస్త్రాలు మానవులు ధరించేందుకు ఉపయుక్తం కాగా జనపనారతో పేనిన గట్టితాళ్లు బండ్లు, రథాలు, గుర్రాలను కట్టడానికి, యుద్ధరంగాలలోనూ ఉపయోగపడతాయి.

కాలమేదైనా వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాలు ప్రజలకు ఉపాధిని కల్పిస్తాయి. ఉపాధి ద్వారా తాము పొందిన సంపదలో కొంత భాగం పన్నుల రూపంలో ప్రజలు ప్రభుత్వానికి చెల్లిస్తే ఆ సొమ్ము తిరిగి ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు, సంక్షేమానికి ఉపయుక్తమవుతుంది.ప్రజల ప్రగతి రాజ్యానికి సుగతి నిస్తుంది. ఈ క్రమంలో ప్రతి రంగాన్నీ క్రమబద్ధీకరిస్తూ ఆయా విభాగాలలోని శ్రామికులు, వ్యాపారులు, వినియోగదారుల మధ్య సమన్వయం సాధించడానికి పాలకులు చట్టబద్ధమైన ఏర్పాట్లను చేయవలసి ఉంటుంది. అందులో భాగంగా పత్తిని, వస్త్రాల తయారీ రంగానికి సంబంధించి ఒక అధ్యక్షుడిని నియమించి అతనికి బాధ్యతలను అప్పగించాలని అంటాడు, చాణక్య.

ఏ ఉత్పత్తియైనా నాణ్యతను సంతరించుకుంటేనే వినియోగదారుని మన్ననలను పొందుతుంది. పనిని చేయించడమే కాదు, పని విధానాన్ని క్షుణ్ణంగా తెలిసిన నిపుణులతో చేయించడం వల్ల ఆయా రంగాలలో నాణ్యమైన ఉత్పత్తులు తయారవుతాయి. ఉత్పత్తి నాణ్యత పెరుగుతుంది, ఉత్పత్తి సామర్థ్యమూ (ఉత్పాదకత) పెరుగుతుంది. అలాగే వాటి నాణ్యతను పరిశీలించాలి. నాణ్యత అంటే వినియోగదారుని మన్ననలను పొం దడం మాత్రమే కాదు... రాజ్య అవసరాలు, సైనిక అవసరాలు, వస్తువుల ఉపయోగం, ఉత్పత్తి ప్రమాణాలు... ఇవన్నీ నాణ్యతలో భాగాలే.

సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు సమాజంలో సముచితమైన స్థానం కల్పించడం, ఉపాధి కల్పన ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించే విధానాన్ని సూచించాడు, చాణక్య. ఆధునిక దృష్టితో గమనిస్తే దానినే మహిళా సాధికారికత అనవచ్చేమో. మహిళలు ముఖ్యంగా తమ కాళ్లపై తాము నిలవాలనుకునే స్త్రీలు, భర్తలు మరణించిన స్త్రీలు, దివ్యాంగులైన స్త్రీలు, భర్తలు దూరదేశంలో ఉన్న స్త్రీలు, వివాహం కాని కన్యలు, ఇల్లు వదిలివేసిన స్త్రీలు, శిక్షాపాత్రులై పనిచేస్తున్న స్త్రీలు, వేశ్యల తల్లులు, వృద్ధులైన దాసీజనం, దేవదాసీలుగా పనిచేయలేని దేవదాసీలు... ఇలాంటి స్త్రీలతో నూలు వడికించ డం, నేయించడం చేయించాలి, అంటారాయన. దీని వల్ల కట్టుబాట్ల బంధనాలలో ఇల్లు విడిచి రాలేని స్త్రీలకు ఉపాధి కలుగుతుంది. ఎవరిపై ఆధారపడకుండా తాము తమ జీవనోపాధిని పొందగలుగుతారు.

ఈ క్రమంలో తయారైన వస్తువులను సూత్రశాలకు (కార్యాలయాలకు) తీసుకువచ్చే స్త్రీల పట్ల అనాదరంగా, అనుచితంగా ప్రవర్తించే అధికారులకు కఠినమైన దండనలనూ సూచించాడు, చాణక్య. అలాగే వారికి చెల్లించవలసిన జీతభత్యా ల గురించీ చెపుతున్నారాయన. నూలు సన్న గా ఉండడం, మధ్యరకంగా ఉండడం, లావుగా ఉండడం... వీటిని బట్టి వారికి చెల్లింపులు చేయాలి. అంతేకాదు, కొందరు ఎక్కువ పని చేయగలుగుతారు.. కొందరు తక్కువ పనిచేస్తారు. వారి పని సామర్థ్యాన్ని బట్టి జీతాల చెల్లింపులు జరగాలి. అలాగే బాగా పనిచేసి న వారికి అదనంగా ప్రోత్సాహక బహుమతులను అందించాలి, అంటారాయ న. అత్యధిక నైపుణ్యం కలిగిన శ్రామికులకు పండుగలలో అధికంగా ప్రోత్సాహకాలను ముట్టజెప్పి, గౌరవించి పనులు చేయించుకోవాలి.

ఎవరెంత పనిచేయాలి, ఎంత కాలం చేయాలి, జీతం ఎంత చెల్లించాలి, తయారై న ఉత్పత్తికి ప్రతిఫలం ఎంత లభించాలి.. ఈ విషయాలను నిపుణులతో చర్చించి పనులు చేయించాలి. వివిధ నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తులు తయారు చేసేందుకు పత్తి, పట్టు, ఉన్ని దారాలను తీసేందుకు అవసరమైన కర్మాగారాలు ఏర్పరచి వాటిలో పనిచేసే కార్మికులకు శిక్షణనిప్పించడం అవసరం. ఉత్తమ పనితనాన్ని కనబరచిన వారికి ప్రోత్సాహకాలు అందించడమూ అవసరమే. ముఖ్యంగా కవచాలు తయారుచేయడంలో ప్రావీణ్యం కలిగిన శిల్పులతో అలాంటి కర్మాగారాలు నడిపించాలి, అంటారాయన.

జీతాల చెల్లింపులు సకాలంలో జరగాల ని, అలా చెల్లించకపోతే బాధ్యులైన అధికారులకు దండన విధించాలని చెపుతారాయన. పనిచేయకుండా కార్మికులకు జీతం ఇచ్చినా, పని చేసిన దానికి జీతం తగ్గించినా సంబంధిత అధికారి శిక్షాపాత్రుడే. ఈ విధానం వల్ల అధికారులలో జవాబుదారీతనం వెలుగుచూస్తుంది. కార్మికుడి శ్రమను దోపిడీ చేయడం, వేతనాలలో మోసం చేయడం, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం, లెక్కల్లో అవకతవకలకు పాల్పడడం లాంటివి నియంత్రణలోకి వస్తాయి.

చాణక్య సూచించిన వస్త్రాలకు సంబంధించినది కాకపోయినా మహాభారతంలోని మయుని వృత్తాంతం.. చాణక్య సూచించిన ‘పని చేయించడమే కాదు, పని విధానాన్ని క్షుణ్ణంగా తెలిసిన నిపుణులతో చేయించడం’ అనే భావనకు దర్పణంగా నిలుస్తుంది. ఖాం డవ వనాన్ని అగ్ని దహించిన సమయంలో నానావిధ శిల్పకళా కుశలుడూ, దానవ విశ్వకర్మయైన మయుడు అనే గొప్ప శిల్పిని అగ్నిదేవుని బారి నుంచి అర్జునుడు రక్షిస్తాడు.

దానికి కృతజ్ఞతా పూర్వకంగా మయుడు అత్యంత వైభవోపేతమైన ఒక సభను నిర్మించి ధర్మరాజుకు బహూకరిస్తాడు. మయసభను గురించిన విశేషాలు అందరికీ తెలిసినవే. అలాగే మహాభారతంలో రథాలు, కవచాలు, ఆయుధాలు మొదలైన వాటి తయారీ గురించిన ప్రస్తావన పలు సందర్భాలలో కనిపిస్తుంది. ఇవన్నీ రాజ్యపాలనలోనూ, యుద్ధవ్యవస్థలో కీలకమైనవిగా భావించాలి. నిజానికి చాణక్యుని కన్నా ముందున్న ప్రాచీన భారతీయ సాహిత్యంలో రాజ్యవ్యవస్థలోనూ ఉత్పత్తి రంగానికి, ముఖ్యంగా సైనిక అవసరాలకు ఉపయోగపడే వస్తువుల తయారీకి ప్రాధాన్యత ఉన్న విషయం రామాయణాది పలు గ్రంథాలలో కనిపిస్తుంది.

ఏ కాలంలోనైనా కార్మికుల శ్రమకు గౌరవం, వినియోగదారునికి నాణ్యమైన ఉత్పత్తులు, అధికార యంత్రాంగానికి జవాబుదారీతనం ఉన్నప్పుడే పన్నుల వసూళ్లు సజావుగా జరిగి, రాజ్య ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అలాగే ప్రజాభీష్టం మేరకు పనిచేసిన ప్రభుత్వాలే శాంతియుతంగా ఉంటాయి. రాజ్యపాలన ఉత్పత్తి వ్యవస్థలో చురుకైన పాత్రను పోషించాలి. అవసరమైన చోట నియంత్రించాలి. ప్రజల నైపుణ్యాలను ప్రభావవంతంగా ఉపయోగించుకోవాలి. కార్మికులకు సరైన ప్రతిఫలం నిర్ణయించాలి, అందించాలి. అలాగే అధికారుల పనితనాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించాలి, నాణ్యతను కాపాడాలి... అలాంటి పాలన వల్ల రాజ్యం సుభిక్షం అవుతుంది.

పాలకుర్తి రామమూర్తి