రహదారి విస్తరణ చేపట్టి ప్రమాదాలను నివారించండి
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి మార్చి 24: హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిని ఆరు వరుసలుగా విస్తరించి ప్రమాదాలను నివారించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ నుంచి కల్వకుర్తి వరకు ఉన్న జాతీయ రహదారి ప్రస్తుతం వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల భద్రత దృష్ట్యా రహదారిని ఆరు వరుసలుగా విస్తరించడం అత్యవసరమని పేర్కొన్నారు. వాహనదారుల సైతం రోడ్డు నిబంధనలు పాటించకుండా అతివేగంగా వెళుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఆరు వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిసిందని, ఆ పనులు ఎంతవరకు వచ్చాయో వివరించాలని సంబంధిత శాఖ మంత్రిని కోరారు. ప్రమాదాల నివారణతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




