20-02-2026 12:00:00 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల అనంతారం, పెద్ద తండా, సిరోలు మండలంలోని తాళ్ల సంకీస, వస్రాం తండా, మన్నెగూడెం,కొత్త తండాలలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్, ఎస్ టి ఎఫ్ హైదరాబాద్ ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో నాటు సారాయి తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాటు సారా తయారు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తహసిల్దార్ బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా19 లీటర్ల సారాయి, 50 కిలోల బెల్లం, 30 కిలోల పటిక స్వాధీనం చేసుకుని, 600లీటర్ల సారాయి తయారీకి ఉపయోగించే బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐలు చిరంజీవి, బిక్షా రెడ్డి, అశోక్ కుమార్, ఎస్ ఐ లు బాలరాజు, శిరీష, కానిస్టేబుళ్లు వెంకన్న, నరసింహారావు, ఇబ్రహీం, శ్రీనివాస్,రాజ్ కుమార్, ట్రైనీ ఎస్‌ఐ శరీస్ పాల్గొన్నారు .
మత్తు పదార్థాలతో జీవితాలు దుర్లభం
కేసముద్రం, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): మత్తు పదార్థాలతో జీవితాలు దుర్లబమవుతాయని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని గూడూరు ఎక్సైజ్ సీఐ బిక్షపతి అన్నారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కేసముద్రం ప్రభుత్వ పాలిటెక్నిక్, కల్వల మోడల్ స్కూల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. యువత డ్రగ్స్ బారిన పడొద్దని,యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
డ్రగ్స్ అలవాటు వల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా, మానసిక స్థితి కూడా పూర్తిగా దెబ్బతింటుందని, ఇది ప్రాణాంతకమని హెచ్చరించారు. మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగం నేరమని, దీనివల్ల విలువైన కెరీర్ నాశనమవుతుందని గుర్తుచేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
విద్యార్థులు కేవలం చదువుపైనే కాకుండా సామాజిక బాధ్యతగా తమ చుట్టుపక్కల వారిని కూడా మత్తుకు దూరంగా ఉండేలా ప్రోత్సహించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్స్ మల్లికార్జున్, పరిమి నవీన్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వీరబాబు , ఫిలిప్స్, సురేందర్, ప్రవళిక , లలిత , డాక్టర్ నర్సయ్య, స్వాతి, వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ యాకుబ్, సిబ్బంది సుధాకర్, నరేష్, గద్దర్, సాయి రామ్ పాల్గొన్నారు.