25 August, 2026 | 1:43 AM

పిక్కలు పీకుతున్న కుక్కలు

25-08-2026 12:00 AM
  1. కరుస్తున్నా కనికరించని అధికారులు
  2. వీధుల్లో విచ్చలవిడిగా స్వైరవిహారం
  3. గుంపులు, గుంపులుగా తిరుగుతూ దాడులు
  4. బయటకు రావాలంటేనే భయపడుతున్న జనాలు
  5. కుక్కకాటేస్తే రేబిస్ వ్యాధితో ప్రాణాంతకమంటున్న వైద్యులు
  6. పాలకవీడు మండలంలో పెరుగుతున్న వీధి కుక్కల సంతతి
  7. నియంత్రించడంలో సంబంధితశాఖ అధికారుల వైఫల్యం

పాలకవీడు, ఆగష్టు 24: మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల వీధి కుక్కల బెడద ఎక్కువ కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతకొద్ది రోజులుగా అనేక ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో అనేకమంది గాయపడి ఆసుపత్రిపాలయ్యారు. దేశ అత్యున్నత న్యాయస్థానం వీధి కుక్కల విషయంలో చర్యలు చేపట్టాలని అధికారులను ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ దిశగా చర్యలు తీసుకున్న ఘటనలు కనిపించడం లేదు.

మండలంలో జానపహాడ్, కోమటికుంట సజ్జపురం జానపహాడ్ దర్గా గుడుగుంట్లపాలెం తదితర గ్రామాలలో కుక్కలు గుంపులుగా సంచరించడం వల్ల ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మండల కేంద్రంలో సై తం ఇటీవల కుక్కల దాడిలో అనేకమంది గాయపడ్డారు. ద్విచక్ర వాహన దారులు కుక్కలు వెంట పడగా క్రిందపడి గాయపడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాత్రి సమయాలు సైతం కుక్కలు వెంట పడుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు కనిపించడం లేదు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వీధి కుక్కల బెడద తప్పించాలని ప్రజలు కోరుతున్నారు.

పెరుగుతున్న కుక్కల సంతతి: 

రోజురోజుకూ సంరక్షణలేని కుక్కల సంతతి పెరుగు తున్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెంటికి నాలుగు చొప్పున రెట్టిం పులో తమ సంతానాన్ని వృద్ది చేసుకుంటున్నాయి. అనధికార లెక్కల ప్రకారం మం డలంలో 2 వేలకు పైగా వీధి కుక్కలు సంచరిస్తున్నాయి. అయినప్పటికీ వీధి కుక్కుల సంతాన నియంత్రణ కార్యక్రమాలు అమలుకావటంలేదు. అధికారులు కుక్కలను అక్కడికి తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ చేయించడంలేదు

వెంటాడుతున్న రేబిస్ భూతం: 

కుక్కకాటు అంటే కేవలం గాయం మాత్రమే కాదు. ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధి మనిషి శరీరంలోకి ప్రవేశించవచ్చు. మెదడు, నాడీ వ్యవస్థను దెబ్బతీసే అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఇది. ఈ లక్షణాలు కనిపించాయంటే. వందశాతం ప్రాణాంతకమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. జిల్లాలో కుక్కకాటు బాధితుల్లో ఈ భయం పొంచి ఉంది. కుక్కకాటు చిన్నగాయంగా కనిపించినా అది రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధికి దారితీసే ప్రమాదముంది.

కుక్క కరిచిన వెంటనే అది పెంపుడు కుక్క అయినా, వీధి కుక్క అయినా అదే. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రేబిస్ టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులకు తెలియ కుండా చిన్న పిల్లలు కుక్కకాటును వాలి పెట్టే ప్రమాదం ఉన్నందున.. తల్లితండ్రులు ఈ విషయంలో ఆప్రమత్తంగా ఉండాలంటున్నారు. పిల్లలకు రేబిస్ ప్రమాదం పై అవగాహన కల్పించాలంటున్నారు. సకాలంలో సరైన చికిత్స తీసుకుంటే రేబీస్ నివారించవచ్చని వైద్యులు స్పష్టం చేశారు.

బయటకు వెళ్లాలంటే జంకుతున్న జనం

మండలంలోని పలు గ్రామాలలో విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలు ఎక్కువగా పిల్లలపైనే దాడి చేస్తున్నాయి. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో పరిస్థితి దారుణంగా ఉంది. మహిళలు, పిల్లలు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాలలో పలువురిపై దాడిచేశాయి. కుక్కల బెడద నుంచి రక్షణ కలిపించాలని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల సంఖ్యను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

కుక్కల అరుపులతో నిద్రపట్టడం లేదు

రాత్రి సమయాల్లో కుక్కలు స్త్వ్రర విహారం చేస్తూ బిగ్గరగా అరుస్తుండడంతో నిద్ర పట్టడం లేదు. ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తూ దాడులు చేస్తున్నాయి.

నాగరాజు, ఉప సర్పంచ్,

 జానపహాడ్ దర్గా