విత్తనాల సరఫరా షురూ
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఖరీఫ్ సీజ్ ప్రారంభం కావడంతో రైతులు పంటలు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ తగిన స్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది 1.34 కోట్ల ఎకరాల్లో పంట సాగు అవుతుందని అంచనా వేసి 16 రకాల పంట విత్తనాలకు 19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అధికారులు ఐదారు రోజుల క్రితమే జిల్లాలకు సరఫరా చేశారు. ప్రస్తుతం సాగు చేసే పంటలకు విత్తనాలు సరిపడకపోతే మరో లక్ష క్వింటాళ్లు జూన్ మొదటి వారంలో రైతులకు అందుబాటులో ఉంచుతామని, విత్తనాల కోసం అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. అదే విధంగా స్థానిక వ్యవసాయశాఖ అధికారులు సూచనల మేరకు పంటలు వేయాలని, ఇష్టానుసారంగా పంటలు వేస్తే నష్టపోయే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పంట మార్పిడిపైనా దృష్టి సారించి అనుకూలమైన పంటలు సాగు చేస్తే ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుందని పేర్కొన్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి: వ్యవసాయశాఖ అధికారులు
కొంతమంది దళారులు నకిలీ విత్తనాలను పెద్దఎత్తున మహారాష్ట, గుజరాత్ నుంచి దిగుమతి చేస్తున్నారని, వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే విత్తనాలపై నిఘా పెట్టామని, ప్రత్యేక టాస్క్‌పోర్సు బృందాలు ఏర్పాటు చేసి పట్టుకున్నట్లు చెప్పారు. ఏ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేసినా తప్పకుండా రసీదు ఉండాలని, ఒకవేళ మోసపోతే వారిని తొందరగా గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా మార్కెట్‌లో ప్యాకెట్ రహిత విత్తనాలు తక్కువ ధరకే ఇస్తుండటంతో అడ్డగోలుగా కొనుగోలు చేస్తే అవి మొలకెత్తవని, వాటిపై ఫిర్యాదు చేసిన తాము ఏమి చేయలేమని సూచించారు.






