10 August, 2026 | 1:32 AM

చెరువుల నుంచి నీరు ఇవ్వొద్దు.. ఆరుతడి పంటలే వేయాలి

10-08-2026 12:00 AM
  1. వరినార్లు పోసి ఎదురుచూపులు.. 
  2. వర్షాభావ పరిస్థితులతో అయోమయంలో రైతులు
  3. నిండుకున్న చెరువుల నుంచి కూడా నీరు ఇవ్వొ౦ద్దని అధికారులు స్పష్టం

టేకులపల్లి, ఆగస్టు 9, (విజయక్రాంతి): వానలు సకాలంలో కురవకపోవడం.. చెరువులు, కుంటల్లో ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో టేకులపల్లి మండల రైతులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు రైతులు వరినార్లు పోసుకుని పొలాల్లో నాట్లకు సిద్ధమవుతుండగా, సాగునీటి పరిస్థితిపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

మండలంలో పలుచోట్ల వర్షపాతం తక్కువగా నమోదవడంతో చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో వరి సాగుకు అవసరమైన నీటిని అందించడం కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చెరువుల నుంచి నీటిని వరి పంటకు విడుదల చేయకుండా, అందుబాటులో ఉన్న నీటిని ఆరుతడి పంటలకు వినియోగించాలనే సూచనలు రైతుల్లో చర్చనీయాంశంగా మారాయి.

వరినార్లు పోసి.. ఎదురుచూపులు

వరి సాగుపై ఆశతో రైతులు ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకున్నారు. నార్లు ఏపుగా పెరుగుతున్నప్పటికీ, పొలాల్లో నాట్లు వేసేందుకు సరిపడా నీరు లేకపోవడంతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. మరోవైపు వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియక నార్లు ముదిరి పోతాయేమోనన్న ఆందోళన కూడా రైతుల్లో నెలకొంది.

ఆరుతడి పంటల వైపు దృష్టి

ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగు చేసే పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు తదితర ఆరుతడి పంటల వైపు రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా పంట నష్టాలను కొంతమేర తగ్గించవచ్చని పేర్కొంటున్నారు.

స్పష్టత కోసం ఎదురుచూపులు

వరి నార్లు పోసుకున్న రైతులకు ప్రస్తుతం ప్రధానంగా సాగునీటి పరిస్థితిపైనే ఆందోళన ఉంది. చెరువుల్లోకి మరింతగా నీరు చేరితే వరి నాట్లు వేసే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ఏడాది వర్షా బావ పరిస్థితులతో ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఆరుతడి పంటలే వేయాలని నిశ్చయించింది. దీనిపై రైతులకు అవగాహన కార్యక్రమాలు వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్నప్పటికీ నీటిపారుదల శాఖ ప్రచారం ప్రజల్లో లేకపోవడం చర్చనీయాంశం అయింది.

దీనికి తోడు చెరువుల్లో నీరున్నప్పటికీ ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో బయటకు వదలొద్దని ప్రభుత్వ ఆదేశాలు పకడ్బందీగా ఉండడంతో ఆ విషయ ప్రచారం సంబంధిత శాఖ అధికారులు రైతులకు తెలపకపోవడంతో చెరువుల నుంచి నీరు ఉంటారని ఇప్పటికే నార్లు పోసి నాట్లు వేసేందుకు ఎదురుచూస్తున్నారు. లేకపోతే ప్రత్యామ్నాయ పంటలపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అధికారులు సాగునీటి పరిస్థితిని పరిశీలించి, రైతులకు ఏ పంటలు సాగు చేయాలి.. నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశాలపై స్పష్టమైన సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.