భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య-
- ప్రియుడితో కలిసి ఘాతుకం
- ఏడాది తర్వాత బయట పడిన రహస్యం
- కాల్‌డేటా, సీసీ ఫుటేజీలు పరిశీలించగా వెలుగులోకి..
- మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
శేరిలింగంపల్లి, జూలై 7 (విజయక్రాంతి): భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి మహారాష్ట్ర సరిహద్దులో గోతిలో పూడ్చిపెట్టిన దారు ణం ఏడాది తర్వాత బయటపడింది. మియాపూర్ పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేయకుండా ‘మిస్సింగ్’ కేసుగా ఫైలును మూలన పడేయడంతో హంతకులు స్వేచ్ఛగా తిరిగారు. ఇప్పుడు మృతదేహం లభించినా.. ఏడాది పాటు కీలక సాక్ష్యాలు చెరిగిపోయాయని స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది నవంబర్‌లో భర్త పెంటేశ్ (45) కనిపించడం లేదంటూ భార్య సత్యవతి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మాత్రం దర్యాప్తు చేయకుండా ఫైలును మూసేశారు. ఏడాది పాటు ఆ ఫైలు కదల్లేదు.. దర్యాప్తు సాగలేదు.. నిజం బయటకు రాలేదు. ఇటీవల సత్యవతిపై అనుమానం కలిగి కాల్ డేటా, సీసీ కెమెరా ఫుటేజ్‌లు పరిశీలించగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, శవాన్ని కారులో మహారాష్ట్ర బోరర్‌కు తరలించి అక్కడ పూడ్చిపెట్టినట్లు తేలింది.
మహారాష్ట్ర పోలీసుల సహకారంతో గునపాలు పట్టుకొని శవాన్ని తవ్వితీశారు. భార్య, ప్రియుడిని అరెస్టు చేశారు. అయితే ఫిర్యాదు వచ్చిన వెంటనే భార్య కదలికలపై నిఘా ఉంచి ఉంటే ఏడాది పాటు హంతకులు స్వేచ్ఛగా తిరిగేవారా? మియాపూ ర్ పోలీస్ స్టేషన్‌లో కేసులను ఇలాగే ‘మిస్సిం గ్’ ముసుగులో గాలికి వదిలేస్తున్నారా? సకాలంలో దర్యాప్తు జరిగి ఉంటే సాక్ష్యాలు సజీవంగా దొరికేవి.. నిందితులు అప్పుడే బయటపడేవారు. ఇప్పుడు శవం దొరికింది కానీ ఏడా ది పాటు సాక్ష్యాలు నశించాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు వివరాలు ఇప్పటికీ గోప్యంగానే ఉన్నాయి.






