23 March, 2026 | 5:19 AM

అడవిలో వన్యప్రాణుల ‘విలవిల’

23-03-2026 12:27 AM

వేటగాల వేటకు బలవుతున్న వన్యప్రాణులు

అంతరించిపోతున్న వన్యప్రాణుల సంపద

జనావాసాల్లోకి ‘పులుల’  పర్యటన

మాంసం ముద్దలు చేసి అమ్ముతున్న వైనం

అదే వ్యాపారంగా పెట్టుకున్న కొందరు వేటగాళ్లు

గారిడి లెక్కల్లో అటవీశాఖ

ఇటీవలే సంగోజిపేట్ లో పులి హతం

వన్యప్రాణులకేది ‘రక్షణ‘’...?

బాన్సువాడ, మార్చి 22 (విజయక్రాంతి): దట్టమైన అటవీ ప్రాంతాలు మైదానాలుగా మారిపోతున్నాయి. స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది. పెద్ద పెద్ద వృక్షాలను గొడ్డలి వేటితో నరికి వేయడం వల్ల వన్యప్రాణులు తలదాచుకునే పరిస్థితి లేకుండా మారింది. త్రాగునీరు లేక వన్యప్రాణులు జనావాస ప్రాంతాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో వేటగాళ్ల సంచారం అధికమయ్యింది. కంటికి కనబడ్డ వన్యప్రాణి హతమారుస్తూ, వాటిని కోసి  మాంసపు ముద్దలుగా చేసి విక్రయించుకుంటున్నారు. ఇటు టేకుతోపాటు వేప ఇతరాత్ర చెట్లను నరుకుతూ స్మగ్లర్లు కాసులు దండుకుంటున్నారు.

రాత్రి వేళల్లో చెట్లను నరకడం.. వాటిని గుట్టుగా సామిల్లులకు తరలించి కావలసిన కొలతల మనంగా కలపను తయారు చేసుకుంటున్నారు. పరిమితులు లేకపోయినా పరవాలేదు.. ఫర్నిచర్ రెడీ చేసి పెడతామంటూ కొంతమంది స్మగ్లర్లు ఆర్డర్లు తీసుకుంటుండడం గమనార్హం. ఇంత జరుగుతున్న అటవీశాఖ అధికారులు ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారు. ఎమ్మార్వో తో పాటు అటవీ పర్యవేక్షణ అధికారులు సైతం విధుల పట్ల ఆలక్ష్యం వహించడం వల్ల ఇదంతా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతాలు ఉండేవి. అలాంటి పరిస్థితులు నేడు కనిపించకుండా ఉన్నాయి.

వన్యప్రాణులపై వేటగాళ్ల గురి..

రాత్రి వేళల్లో వేటగాళ్లు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. వారి కంటపడిన వన్యప్రాలను చాకచక్యంతో వేటాడుతున్నారు. వారి వలకుచిక్కి వన్యప్రాణుల ప్రాణాలు హరిమంటున్నాయి. అడవి పంది, యేదు, కుందేళ్లు, జింకలు, ఇతరాత్ర వన్యప్రాణుల సైతం వేటగాళ్ల గుడికి బలి అవుతున్నాయి. వన్యప్రాణుల మాంసాన్ని ఆరగించే వ్యక్తులు ఆర్డర్ వేసిన మరుసటిరోజే పరిస్థితి ఏర్పడింది. కొందరు వేటగాళ్లు ఇదే వ్యాపకంగా పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు.

వన్య ప్రాణులను వేటాడని చట్టరీత్యా  నేరమైనప్పటికీ, అవేమీ వారికీ పట్టనట్లుగా ఉన్నాయి. రాత్రి వేళల్లో అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వహించే క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వివరించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రతిసారి సమావేశాల్లో జిల్లా అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయి అధికారులకు అవేమి చెవికి పట్టినట్లుగా మారుతున్నాయి. ఫలితంగా వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది.

గత రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సంగోజిపేట, హనుమాజీపేట్ మధ్య ప్రాంతంలో ఓ చిరుతపురి కళేబరం లభ్యమయింది. పులిగోర్లు, పులి దంతాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పులిని హతమార్చి గోర్లను దంతాలను వేటగాళ్లు తీసుకెళ్లినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా అటవీ శాఖ అధికారిని తో పాటు బాన్సువాడ ఎఫ్‌ఆర్‌ఓ స్థాయి అధికారుల వరకు విచారణ చేస్తామని ప్రకటించారు.

పులిని హతమార్చి వాటి దంతాలు గోర్లను తీసుకెళ్లే వారిని గుర్తించి కఠిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అధికారుల ప్రకటన సరైనదే అయినప్పటికీ, ఇదంతా పులి పులిని హతమార్చే ముందు జరిగి ఉంటే బాగుండేది కదా.. అంటూ వన్యప్రాణుల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి పులి గోర్లను ఎత్తుకెళ్లిన నిందితులను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఇలాంటి వేట్లగాలపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

వృక్ష సంపదపై గొడ్డలి వేటు..

మన్యంలో స్మగ్లర్ల సంచారం రోజు రోజుకు పెరుగుతోంది. వృక్ష సంపద నానాటికి తగ్గుముఖం పడుతుంది. ఎత్తున వృక్షాలు గొడ్డలివేటితో నేలకొరుగుతున్నాయి. ట్రాక్టర్లు టిప్పర్లలో వృక్ష సంపద అక్రమ రవాణా జరుగుతుంది.  గుట్టుగా సాగుతున్న వీరి వ్యాపారం పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఖరీదైన వృక్షాలతో పాటు ఇతర వృక్షాలు కూడా వీరి గొడ్డలి వేటుకు వృక్షవిలాపం చేస్తున్నాయి. పచ్చగా కనిపించే భారీ వృక్షాలు ఎండిపోయి మోడు బారిపోవడంతో వాటిని స్మగ్లర్లు కొంతమంది అమాయకుల సహాయంతో నరికి వేస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి.

వీరికి సామిల్లుల యజమానులు సైతం సహకరిస్తుండడంతో వీరి ప్రక్రియకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ విషయంలో కూడా అటవీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ ప్రాంతాల నుండి ఏ కర్ర బయటకు వచ్చిన శాఖ నుండి అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. భారీ మొత్తంలో కలపను తీసుకెళ్లినట్లయితే ఆ శాఖ ద్వారా వేబిల్లులు  పొందాల్సి ఉంటుంది.

వడ్రంగి వారు తప్ప మిగతా కొంతమంది వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా కలపను దొంగిలించకపోతున్నారు. వాటిని రహస్యంగా సామీలులకు చేరుస్తూ నచ్చిన సైజులో మార్చుకుంటున్నారు. అట్టి కల్పన ఫర్నిచర్ తయారు చేసే వ్యక్తులకు అప్పగించి కాసులను దండుకుంటున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు వన్యప్రాణులకు భద్రత కల్పించడంతోపాటు, వృక్ష సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిరంతరం నిఘా 

కామారెడ్డి జిల్లాలో అటవీశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గతంలో వేటగాళ్లు సంచరించేవాళ్లు. ప్రస్తుతం అలాంటిది ఏమీ లేదు. అడవులలో సీసీ కెమెరాలు ఫ్లాష్ కెమెరాలను ఏర్పాటు చేశాం. నిరంతరం నిఘా కొనసాగుతుంది. వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు ఉండడంతో వేటగాళ్లు భయాందోళన కు గురవుతున్నారు. వన్యప్రాణుల వేట చేయడానికి సహసించడం లేదు.

- భోగ నికిత , జిల్లా అటవీ శాఖ అధికారినీ, కామారెడ్డి