calender_icon.png 6 February, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన కుర్రాళ్లు ఆరేస్తారా ?

06-02-2026 02:00:49 AM

  1. నేడు అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్
  2. ఇంగ్లాండ్‌తో భారత్ టైటిల్ ఫైట్
  3. అందరి చూపు వైభవ్ సూర్యవంశీవైపే

అండర్ 19 ప్రపంచకప్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఇండియానే.. ఎందుకంటే ఈ మెగాటోర్నీలో మన ఆధిపత్యం అంతా ఇంతా కాదు.  ఇప్పటి వరకూ 14 సార్లు వరల్ కప్ జరిగితే భారత యువ జట్టు ఐదు సార్లు చాంపియన్ గా నిలిచింది. తర్వాత ఆస్ట్రేలియా 4 టైటిల్స్ తో రెండో స్థానంలో ఉంటే.. ఇప్పుడు భారత కుర్రాళ్లు ఆరోసారి టైటిల్ పై కన్నేశారు. మరి ఇంగ్లాండ్ కు చెక్ పెట్టి యంగ్ ఇండియా ఇది సాధిస్తుందా ?

హరారే, ఫిబ్రవరి 5 : అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‌కు కౌంట్ డౌన్ మొదలైంది.  హరారే వేదికగా శుక్రవారం భారత్ , ఇంగ్లాండ్ టైటిల్ కోసం తలపడబోతున్నాయి. ఈ టోర్నీ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు ఉన్న భారత్ ఆరోసారి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. అటు 1998 తర్వాత తొలిసారి వరల్ కప్ గెలవాలని ఇంగ్లాండ్ ఉవ్విళ్లూరుతోంది. నిజానికి ఈ టోర్నీలో భారత్, ఇంగ్లాండ్ మాత్రమే ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి. బ్యాటింగ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపుతున్నాడు.

దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ మెరుపులను మెరిపిస్తున్నాడు. సెమీస్ లోనూ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అతనితో పాటు ఆరోన్ జార్జ్ , కెప్టెన్ ఆయుశ్ మాత్రే కూడా ఫామ్ అందుకున్నారు. హైదరాబాదీ కుర్రాడు ఆరోన్ జార్జ్ సెంచరీతో రెచ్చిపోతే.. మాత్రే కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. వీరితో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తే భారీస్కోరు ఖాయం. అటు బౌలింగ్ లోనూ భారత్ సత్తా చాటుతోంది.

మరోవైపు ఇంగ్లాండ్ జట్టు కూడా బ్యాటింగ్, బౌలింగ్ లలో పటిష్టంగా ఉంది. బెన్ మేయస్ 399 పరుగులతో టోర్నీలోనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. అటు ఇంగ్లాండ్ అండర్ 19 జట్టు కెప్టెన్ థామస్ కూడా ఫామ్ లో ఉన్నాడు,  అటు పేసర్లు , స్పిన్నర్లు కూడా నిలకడగా రాణిస్తుండడం ఇంగ్లాండ్ కు అడ్వాంటేజ్.  ఆల్ రౌండ్ షోతో వరుస విజయాలు సాధిస్తున్న ఇంగ్లాండ్ అండర్ 19 జట్టు చివరి సారిగా 1998లో వరల్ కప్ గెలిచింది.