పవన్ కాపుకాసేనా?
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి) : దశాబ్దానికిపైగా రాజకీయాల్లో కొనసాగుతూ, ఎంతగానో శ్రమించిన పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలపై తనదైన ముద్రవేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సినీ నటుడిగా తనకున్న ప్రజాదరణను రాజకీయ శక్తిగా మలచడంలో ఆయన విజయవంతమయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలను ఎప్పటినుంచో ప్రభావితం చేస్తున్న కీలక సామాజికవర్గం కాపు సమాజం లో ఆయన అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా ఎదిగారు.
అయితే ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థుల కంటే సొంత సామాజికవర్గం నుంచే పవన్ కల్యాణ్ పలు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. తాజాగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పలు పరిణామాలే అందుకు నిదర్శనం. త్వరలో రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ రకమైన సూచనలు వెలువడుతున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న విషయం విదితమే. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి మూడు, జనసేనకు ఒక స్థానం దక్కేటట్టు పాలక కూటమిలో అవగాహన కుదిరినట్టు రాజకీ య వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీజేపీకి రెండు రాజ్యసభ స్థానాలను కూటమి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనకు దక్క నున్న ఏకైక రాజ్యసభ స్థానాన్ని ఏ వర్గానికి కేటాయిస్తారనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మొదటినుంచి పార్టీకి అండగా నిలిచిన తమకే ఆ స్థానాన్ని కేటాయించాలని కాపు సామాజికవర్గానికి చెందిన ముఖ్య నేతలు, శ్రేణు లు ఆశిస్తున్నారు. కాపు నేతల ఆలోచనలు ఇలాఉండగా, మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు అత్యంత సన్నిహితుడు, కమ్మ సామాజికవర్గానికి చెందిన ఓ నేతను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఊహాగానాల నేప థ్యంలో ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది ఒక రాజ్యసభ స్థానానికి చెందిన అంశం మాత్రమే కాదని కాపు సామాజికవర్గానికి చెందిన కీలక నాయకులు అభిప్రాయప డుతున్నారు. జనసేన నిర్మాణంలో మొదటి నుంచి కీలకపాత్ర పోషించిన తమ సామాజికవర్గానికి పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కుతున్నదా, లేదా? అన్న కోణంలో వారు ఈ అంశాన్ని చూ స్తున్నారు.
గతంలో జనసేన కష్టకాలంలో ఉన్నప్పుడు కా పు సామాజికవర్గమే పార్టీకి, అధినేత పవన్ కల్యాణ్‌కు అండగా నిలిచిందని, ఎప్పటినుంచో సంప్ర దాయంగా ఇతర రాజకీయ పార్టీలతో కొనసాగుతున్న బంధాన్ని పక్కనబెట్టి మరీ పవన్ కల్యాణ్ కు మద్దతిచ్చామని వారు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఇంతచేసినా ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో తమ సామాజికవర్గానికి తగిన ప్రా ధాన్యం లభించడం లేదని చెప్తున్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తమకు పార్టీలో అన్యాయం జరుగుతున్నదనే భావన కాపు సామాజికవర్గానికి వర్గంలో పెరుగుతున్నదని వారు అంటున్నారు.
కమ్మ సామాజికవర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌కు మంత్రివర్గంలో కీలక బాధ్యతలు దక్కడం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తున్నది. ఇదే సమయంలో తాను కేవలం కాపు నాయకుడిని కాదని, అన్ని వర్గాల నాయకుడినని పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత ఆజ్యం పోశాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు కొందరిలో అసంతృప్తిని పెంచినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా కమ్మ సామాజికవర్గానికి రాజ్యసభ సీటు కేటాయించడం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అలాంటి నిర్ణయం పవన్ కల్యాణ్‌తో పాటు చంద్రబాబుకి కూడా రాజకీయంగా ప్రతికూలంగా మారవచ్చని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ వివాదం పవన్ కల్యాణ్ భవిష్యత్తు రాజకీయ లక్ష్యాలకు సంబంధించి కీలకంగా మారింది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ బాధ్యతలు పెరగడం, ఉప ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనా అనుభవాన్ని గడిస్తుండటం లాంటి అంశాలు కూడా ఆ దిశగానే సంకేతాలు ఇస్తున్నాయి.
అయితే ఓ నాయకుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలంటే ఆయనకు బలమైన సామాజిక, రాజకీయ అండ అవసరం. పవన్ కల్యాణ్‌కు ఇప్పటివరకు కాపు సామాజికవర్గమే అండగా నిలుస్తూ వచ్చింది. ఆ సామాజిక వర్గమే పవన్ కల్యాణ్ బలమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో కూటమిలో జనసేన కీలక భాగస్వామిగా మారడానికి కూడా ఈ సామాజికవర్గంలో ఆయనకు ఉన్న ప్రభావమే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్‌ను కలవడం కష్టంగా మారిందంటూ పలువురు నేతలు చేస్తున్న విమర్శలు కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తున్నా యి.
దాసరి రాము వంటి నాయకులు పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై బహిరంగంగా ప్రశ్న లు లేవనెత్తడం ఈ అసంతృప్తికి మరింత ఊతమిచ్చింది. పవన్ కల్యాణ్ ఇప్పుడు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. కాపు రాజకీయాలకు మాత్ర మే పరిమిత మైతే కుల రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వస్తాయి. అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తే జనసేనకు ప్రధాన మద్దతుదారుగా ఉన్న సామాజికవ ర్గంలో అసంతృప్తి పెరిగే ఆస్కారం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి విభేదాలు గతంలో కూడా వచ్చాయి. అయితే సరైన వివరణలు, రాజకీయ సర్దుబాట్లతో అవి సద్దుమణిగాయి. కానీ, ప్రస్తుత రాజ్యసభ వివాదం మా త్రం జనసేనలో ఒక కీలక అంతర్గత వైరుధ్యాన్ని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారుతాయని చెప్పక తప్పదు.
పార్టీకి మొదటి నుంచి అండగా నిలబడిన సామాజికవర్గాన్ని విస్మరించడం తన ఉద్దేశం కాదని, విస్తృత రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇలాంటి నిర్ణ యం తీసుకోవాల్సి వస్తున్నదని పవన్ కల్యాణ్ తన మద్దతుదారులకు వివరించగలగాలి. అప్పుడే ఈ వివాదం సద్దుమణుగుతుంది.
లేకపోతే కాపు సామాజికవర్గ ఆకాంక్షలకు ప్రతినిధిగా ఎదిగిన పవన్ కల్యాణ్‌కు ఇది పెద్ద రాజకీయ సవాలుగా మారవచ్చు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి పదవి లక్ష్యంగా ముందుకుసాగుతున్న ఆయనకు సంప్రదాయంగా మద్దతుగా నిలుస్తున్న సొంత సామాజికవర్గాన్ని కాపాడుకుంటూనే, ఇతర వర్గాల్లోనూ విస్తరించడం భవిష్యత్తులో అతిపెద్ద పరీ క్షగా నిలుస్తుందని చెప్పవచ్చు.






