22 July, 2026 | 6:47 PM

ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉంటారా?

07-06-2024 01:09 AM

గతంలో రెండు సార్లు తిరస్కరించిన కాంగ్రెస్ నేత

ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడంతో.. ఆయనే ఉండాలని నేతల్లో మొదలైన భావన

న్యూఢిల్లీ, జూన్ 6: సార్వత్రిక ఎన్నికల్లో పనితీరుపై కాంగ్రెస్ శిబిరంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పక్షనేతగా రాహుల్‌గాంధీ లోక్‌సభలో పార్టీని ముందుండి నడిపించాలని డిమాండ్లు మొదలయ్యాయి. 2014, 2019 ఎన్నికల్లో తక్కువ సీట్లు సాధించిన కారణంగా కాంగ్రెస్ సొంతంగా ప్రతిపక్ష హోదాను పొందలేకపోయింది. అయితే 2014లో ప్రస్తుత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించారు. 2019లో అధీర్‌రంజన్ చౌదరి ఆ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం 99 మంది ఎంపీలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కింది. దీంతో రాహుల్ పక్షనేతగా ఉండాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. 

పరిస్థితులు మారాయి..

2014లో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో కీలక స్థానంలో గాంధీ వ్యక్తులే ఉండాలని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ, రాహుల్ పదేపదే వారి అభ్యర్థనలను తిరస్కరిస్తూ వస్తున్నారు. గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ లోక్‌సభ నాయకుడిగా ఉండలేనని రాహుల్ పేర్కొన్నారు. రెండు బాధ్యతలను నిర్వహించడం వల్ల రోజువారీ కార్యక్రమాల్లో గందరగోళం తలెత్తుందని పార్టీ నేతలకు వివరించారు. కానీ, 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు సీట్లు పెరిగి పరిస్థితులు మారాయి. అంతేకాకుండా గత కొన్నేళ్లుగా నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయ ఫ్రంట్‌గా రాహుల్ ఉంటూ వస్తున్నారు.

దీంతో రాహుల్ పక్షనేత అయితేనే దీనికి సహజత్వం వస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా వచ్చిన నేపథ్యంలో అసలైన నేతనే పార్లమెంటులో నాయకత్వం వహించాలని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. రాహుల్ లోక్‌సభ పక్షనేత కావాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పటివరకు దానిపై ఎలాంటి చర్చ జరగలేదు. కానీ పార్టీ నేతలు అదే కోరుకుంటున్నారు అని కాంగ్రెస్‌కు చెందిన ఓ కీలక నేత వెల్లడించారు. అంతేకాకుండా రాహుల్‌గాంధీ మరో కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాయ్‌బరేలీ, వయనాడ్ రెండింటిలో గెలిచిన ఆయన ఏ స్థానాన్ని వదులుకుంటారో చూడాలి.