హుస్నాబాద్‌లో మూడు జిల్లాల అధికారులతో జరిగే ఎల్‌నినో సమీక్ష ఏర్పాట్ల పరిశీలన
శాతవాహన ఇంజినీరింగ్ విద్యార్థుల వసతి సదుపాయాలపై కలెక్టర్ ఆదేశాలు
హుస్నాబాద్: హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం జరగనున్న హుస్నాబాద్ నియోజకవర్గ ఎల్‌నినో సన్నాహక సమీక్ష సమావేశ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మూడు జిల్లాల అధికారులు పాల్గొనే సమావేశానికి ఫర్నిచర్, ప్రొజెక్టర్, మైక్, తాగునీరు, విద్యుత్, భోజనం తదితర ఏర్పాట్లు ఎలాంటి లోటు లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం హుస్నాబాద్ 20వ వార్డులోని రైతు బజార్ భవనంలో శాతవాహన ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల కోసం తాత్కాలికంగా కేటాయించిన వసతి గృహాన్ని సందర్శించారు. శాశ్వత కళాశాల నిర్మాణం పూర్తయ్యే వరకు విద్యార్థులకు మరుగుదొడ్లు, భోజనం, మౌలిక వసతులు సహా అన్ని సౌకర్యాలను కళాశాల యాజమాన్యంతో సమన్వయం చేసుకుని కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్, కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.






