19 April, 2026 | 2:13 AM

అదానీ, అంబానీలపై రాహుల్ ఇప్పుడు నోరు మెదపరేం?

09-05-2024 02:26 AM

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు నాణేనికి బొమ్మాబొరుసులాంటివే

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కలెక్షన్ల కన్నా కాంగ్రెస్ ఆర్‌ఆర్ ట్యాక్సే ఎక్కువ 

వేములవాడలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ

రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధానిగా రికార్డు

రాజన్న సిరిసిల్ల, మే 8 (విజయక్రాంతి): ఇప్పటివరకు జరిగిన మూడు విడుతల ఎన్నికల్లో ఇండియా కూటమికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అంచనా వేశారు. మిగిలిన నాలుగు విడతల్లోనూ ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కరీంనగర్ స్థానంలో బండి సంజయ్ విజయం ఇప్పటికే నిర్ణయమైపోయిందని చెప్పారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికీ తెలియదని అన్నారు. భారత్ పదేళ్లలో అన్ని రంగా ల్లో ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం చేశామని గుర్తు చేశారు. మీ ఓటు వల్లే ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానంలో ఉందని చెప్పారు.

రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. పదేళ్ల తన పనితీరును ప్రజలంతా గమనించారని, ప్రతి రంగాన్ని ముందుకు తీసుకెళ్లామని, కిసాన్ సమ్మాన్‌తో రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. వ్యవసా యాన్ని ఆధునికీకరించి లాభసాటిగా మా ర్చామన్నారు. టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేశామన్నారు. కాళేశ్వరం, ఓటుకు నోటు కేసుల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వైఖరి ఒకటేనని మండిపడ్డారు. తెలంగాణను ఆ రెండు పార్టీల నుంచి విముక్తి చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇన్ని రోజులుగా రాహుల్‌గాంధీ అదే పనిగా అంబానీ, అదానీలను విమర్శించేవారని ఎన్నికలు మొదలైన నాటి నుంచి వారిని విమర్శించడం లేదన్నారు. వారి మధ్య కుదిరిన ఒప్పందం, అందిన నిధులు ఎంత అని ప్రశ్నించారు. 

కుటుంబాలే ప్రాధాన్యం..

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుటుంబం వల్ల.. కుటుంబం చేత.. కుటుంబం కోసమనే నినాదంతోనే పనిచేస్తున్నాయన్నారు. ఆ రెండు అవినీతి పార్టీలని, తెలంగాణ ప్రజల స్వప్నాలను కాలరాశాయన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ప్రజల కలలు సాకారమవుతాయని భావించారు కానీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి కుటుంబ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్ పనిచేసిందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కూడా కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. ఆ రెండు పార్టీలు నాణేనికి బొమ్మాబొరుసులాంటివేనని చెప్పారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహరావును కూడా కాంగ్రెస్ అవమానపరిచిందని మండిపడ్డారు. ఆయన పార్థివదేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి కూడా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న ప్రకటించి బీజేపీ గౌరవించిందని గుర్తుచేశారు. తెలంగాణలో ఆర్‌ఆర్ ట్యాక్స్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోందని... ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కలెక్షన్ల కన్నా కాంగ్రెస్ ఆర్‌ఆర్ ట్యాక్స్ ఎక్కువ వసూల్ చేస్తున్నట్లు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిను ఉద్దేశించి ఆరోపించారు. తెలంగాణలోని ఒక ఆర్ లూటీ చేసి, ఢిల్లీలో ఉన్న మరో ఆర్‌కు పంపిస్తున్నారని ఆరోపించారు. 

ముస్లింల రిజర్వేషన్ల కోసం కుట్ర

ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ప్రసాదించిన రిజర్వేషన్లకు కాంగ్రెస్ గండి కొట్టి ముస్లింలకు చెందేలా కుట్ర చేస్తుందని మోదీ తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాదిగలకు న్యాయం చేయాలని కోరుతుంటే వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ముస్లింలకు రిజర్వేషన్లు చెందాలని మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ హైదరాబాద్‌ను ధారాదత్తం చేశాయని, బీజేపీకి, ఎంఐఎంకు ధీటైన పోటీ ఇవ్వడంతో ఆ పార్టీలు ఎంఐఎంను గెలిపించేందుకు అనేక పన్నాగాలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఆయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుపుకుంటే తెలంగాణ నుంచి ఆలయానికి తలుపులు పంపించి ఇక్కడి ప్రజలు తమ భక్తిశ్రద్ధలు, విశ్వాసాన్ని చూపారని గుర్తుచేశారు. 

కాంగ్రెస్ దీనిపై ఈర్ష్య ద్వేషాలను వ్యక్తం చేస్తోందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే కోర్టుతీర్పు పునఃపర్యవేక్షిస్తామంటూ వ్యాఖ్య లు చేయడం చూస్తుంటే రాచరిక వ్యవస్థకు నిదర్శనంగా కనిపిస్తుందని చెప్పారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రజలంతా గమనిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.