10-02-2026 12:00:00 AM
చైర్మన్ పీఠాలు దక్కడం కల్ల
రాష్ట్ర నాయకత్వం నుంచి సహకారం కరువు
కింగ్ మేకర్ అవుతామని భావిస్తున్న నాయకులు
మేడ్చల్, ఫిబ్రవరి ౯ (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రభావం అంతంతమా త్రంగానే కనిపిస్తోంది. మిగతా పార్టీలతో పోలిస్తే బిజెపి ప్రచారంలో వెనుకబడింది. బరిలో ఉన్న అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలిచే నాయకులు లేరు. జిల్లా నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. రాష్ట్ర నాయకత్వం మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టడం లేదు.
ప్రచార బాధ్యతలు ఒక్క ఈటల రాజేందర్ పైనే ఉంది. అధిష్టానం నియమించిన మున్సిపాలిటీల ఇన్చార్జిలు సైతం రావడం లేదు. కొన్నిచోట్ల అభ్యర్థులే తమ పలుకుబడితో సొంతంగా కొట్లాడుతున్నారు. మరికొన్నిచోట్ల అభ్యర్థులు నామమాత్రంగా బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మాదిరి బిజెపి అభ్యర్థులకు ఆర్థిక వనరులు లేవు. అయినప్పటికీ కొన్ని వార్డులలో బిజెపి అభ్యర్థులు ప్రత్యర్థులకు దీటుగా విజయం కోసం పోరాడుతున్నారు. జిల్లాలో ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి.
ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో 8 వార్డులలో బిజెపి అభ్యర్థులు గట్టి పోటీని ఇస్తున్నారు. ఎల్లంపేట లోని రెండు వార్డులు, రావల్ కోలు లోని రెండు వార్డులు, రాజు బొల్లారం తండా, రాజు బొల్లారం, బండ మాదారం, శ్రీరంగవరం వార్డులలో బిజెపి అభ్యర్థులు ప్రత్యర్థులతో సమానంగా పోటీపడుతున్నారు. ఇందులో ఐదు నుంచి 8 వార్డులు గెలుపొందుతామని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఇందులో కనీసం ఐదు స్థానాలు గెలుపొందిన బిజెపి కౌన్సిలర్లే కీలకమవుతారు. కింగ్ మేకర్ అయితే ఏ పార్టీకి మద్దతు నిస్తారనేది చర్చనీయాంశమైంది. ఎస్టి మహిళకు రిజర్వుడ్ అయిన చైర్పర్సన్ పదవి కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ఈ రెండు పార్టీలలో ఒక పార్టీకి 13 స్థానాలు వస్తే బిజెపి కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉండదు. ఈ రెండు పార్టీలకు 13 కంటే తక్కువ వస్తే ఇతరుల మద్దతు అవసరమవుతుంది. బిజెపి కౌన్సిలర్లు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశం లేదు. బిజెపికి మద్దతునిస్తారా లేక తటస్థంగా ఉంటారు అనేది వేచి చూడాల్సిందే!
జిల్లా అధ్యక్షుడు మున్సిపాలిటీలో గడ్డు పరిస్థితి
జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ స్వగ్రామం జగన్ గూడ. ఈ మున్సిపాలిటీ పరిధిలో బిజెపికి గడ్డు పరిస్థితి ఉంది. రెండు మూడు వార్డులలోనే బిజెపి అభ్యర్థులు పోటీని ఇస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా, మూడు వార్డులలో బిజెపి అభ్యర్థులు లేరు.
కొల్తూరు లోని 16వ వార్డు, 19వ వార్డు, అడ్రస్ పల్లి లోని 23వ వార్డులో బిజెపి అభ్యర్థులు లేరు. ఈ వార్డులలో కాంగ్రెస్ టీఆర్‌ఎస్ మధ్య ముఖా ముఖి పోటీ ఉంది. జిల్లా అధ్యక్షుడి సొంత గ్రామం జగన్ గూడ లో కూడా బిజెపి అభ్యర్థులు గెలుస్తారని గ్యారెంటీ లేదు.
అలియాబాదులోనూ అంతంతే!
అలియాబాద్ మున్సిపాలిటీలోనూ బిజెపి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తురకపల్లి తో పాటు మరో వార్డులో బిజెపి అభ్యర్థులు పోటీనిస్తున్నారు. ఇటీవల లాల్ గడ్డి మలక్పేటలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ తమకు లభిస్తుందని, ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతారని బిజెపి నాయకులు భావిస్తున్నారు.
కింగ్ మేకర్ అవుతామని భావిస్తున్న నాయకులు
మూడు మున్సిపాలిటీలలో పెద్ద సంఖ్యలో వార్డులలో గెలుపొంది కింగ్ మేకర్ అవుతామని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఎల్లంపేటలో కనీసం ఏడు వార్డులు గెలుపొందుతామని ధీమాతో ఉన్నారు. అలియాబాద్ మున్సిపాలిటీలలో 3,4 వార్డులు గెలుపొందుతామని భావిస్తున్నారు. మూడు మున్సిపాలిటీలలో ఏ పార్టీకి మెజారిటీ రాదని, తమ ఓట్లే కీలకమవుతాయని అంటున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత అధిష్టానం నిర్ణయం మేరకు చైర్మన్ ఎన్నికల్లో పాల్గొంటామని అంటున్నారు.