అర్హులకు పెన్షన్ అందేనా?
- కొత్త ప్రభుత్వంలోనైనా, ఆసరా, పెన్షన్లు వస్తాయా
- కొత్తగా ఒక్కరికీ పింఛన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కారు
- అర్హులను తేల్చడంలోనూ తీవ్ర జాప్యం
- జిల్లాలో దాదాపు లక్ష మంది పెన్షన్ కోసం ఎదురుచూపులు
- ఆర్థిక ఇబ్బందుల్లో దరఖాస్తుదారులు
ఎల్లారెడ్డి, ఆగష్టు,(విజయ క్రాంతి), ఆసరా పెన్షన్ కోసం అర్హులైన వారు ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు చేసుకొని పెన్షన్ వస్తుందని ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు అయినా అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందడం లేదు, నెలకు పింఛన్ రూ.4వేలకు ఇస్తామని చెప్పడంతో వేలాదిమంది ఎంతోఆశగా ఎదురు చూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఇవ్వడంతోపాటు, నెలకు పింఛన్ రూ.4వేలు ఇస్తామని చెప్పడంతో వేలాదిమంది ఎంతోఆశగా ఎదురుచూశారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత కొత్త పింఛన్దారులను చేర్చకపోవడంతోపాటు, నెలకు రూ.4వేల హామీ అటకెక్కించింది. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నెలవారీ ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 2022 ఆగస్టులో కొత్త పింఛన్లను మంజూరు చేసింది. ఆ తరువాత ప్రజా ప్రభుత్వం పేరిట ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఒక్కరిని కూడా ఆసరా పథకంలో చేర్చలేదు.
పింఛన్ పొందుతున్న భర్త మ రణిస్తే ఆయన స్థానంలో భార్యకు పక్షం రోజుల్లో పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పలువురిలో ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రజాపాలన కార్యక్రమంలోనూ లక్షలాది దరఖాస్తులు ఆసరా పింఛన్ల కోసం వచ్చినా.. వాటిని తూతూ మంత్రంగా స్వీకరించడం తప్పితే ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన దాదాపు లక్ష మంది ఆసరా పింఛను కోసం ఎదురుచూస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, హెచ్‌ఐవీ బాధితులు, డయా లసిస్ పేషెంట్లు, వృద్ధ కళాకారులకు ప్రతినెలా ఆసరా పథకం ద్వారా పింఛన్ ఇచ్చి వారికి అండగా నిలిచింది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 11 క్యాటగిరీలలోని 39.41 లక్షలమంది ఆసరా లబ్ధిదా రులు ఉండగా, దివ్యాంగులకు నెలకు రూ.4,016, వృద్ధ కళాకారులకు రూ.3,016, మిగిలిన తొమ్మిది వర్గాల వారికి రూ.2,016 చొప్పున పింఛన్లు ఇచ్చి ఆదుకున్నది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరికీ పింఛన్ మొత్తాన్ని రూ.4వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ అతీగతీ లేదు.
నిబంధనల ప్రకారం వృద్ధాప్య పింఛన్ 65 ఏండ్లు దాటిన పేదలకు, 50ఏండ్లు దాటిన చేనేత, కల్లు గీత, బీడీ కార్మికులకు వారికి ఆసరా పింఛన్ ఇవ్వాలి. అలాగే వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితుల ఇంతే మొత్తాన్ని ఇవ్వాలి. కానీ కొత్తగా ఏర్పడిన రేవంత్ సర్కారు నిధుల లేమి కారణంగా చూపుతూ కొత్తగా ఆసరా పథకంలో లబ్ధిదారులను చేర్చడం లేదు.
ఎన్నాళ్లకో మోక్షం
ఆసరా దరఖాస్తులను ప్రభుత్వం దాదాపుగా పదేళ్లా పాటుగా పక్కన పెట్టింది. భర్త మృతి చెందితే ఆయన స్థానంలో భార్యకు మంజూరు చేయలేదు. వితంతు విభాగం కింద ద రఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. దీంతో సకాలంలో పింఛను మంజూరు కాక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వింతంతువులు చాలా మం ది ఉన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో వినతులు అందిస్తున్నా రు.
వీరికి ప్రత్యేక వెసులుబాటు లేకపోవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం జీవిత భాగస్వామికి ఆసరా పిం ఛను నిర్ణయంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని ఆశలు పెంచుకుంటున్నారు. వృద్ధాప్య పింఛన్ దారుడు మరణిస్తే జీవిత భాగస్వామి తన ఆధార్ కార్డుతో పాటు చనిపోయిన వ్యక్తి మరణ దృవీకరణ పత్రాన్ని జత చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి. అదే పట్టణాల్లో అయితే బిల్ కలెక్టర్కు అప్పగించాలి.
ఈ పత్రాలు స్వీకరించిన అధికారులు మండల స్థాయిలో అయితే వీటిని వెంటనే ఎంపీడీవో, పట్టణాల్లో అయితే ము న్సిపల్ కమిషనర్కు పంపించాలి. వీరి పరిశీలన అనంతరం జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారి పరిశీలించి కలెక్టర్ ఆమోదం కోసం పంపించాలి. వీటి కోసం ఇప్పటికే ఆసరా పోర్టల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రక్రియలన్నింటినీ 15 రోజుల లోపు పూర్తి చేయాల్సి ఉంది.
అంటే దరఖాస్తు చేసుకున్న వారికి పక్షం రోజుల్లోగా పెన్షన్ మంజూరు అవుతుంది. కానీ ఆసరా పథకం కింద అర్హులైన లబ్ధిదారుల కు పెన్షన్ సకాలంలో మంజూరు కాక నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం ఏమిటి కోనని అంటున్నారు. అర్హులైన లబ్ధిదారులు పెన్షన్ సకాలంలో రాక ఆందోళన చెందుతున్నారు. కనీసం ప్రజా ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ లు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఏడేండ్లవుతున్న పెన్షన్ లేదు
నాకు కాలు విరిగి దాదాపు ఏడు సంవత్సరాలు అవుతుంది.ఆసుపత్రికి రెండు సార్లు సదరం క్యాంపు కు,వెళ్లా మండల అభివృద్ధి కార్యాలయం కు ఎన్నో సార్లు వెళ్లిన ఫలితం లేదు. సార్ పెన్షన్ అంటే పైనుండి రాలేదు అంటున్నారు.
లకావత్ శాంతి, నాగిరెడ్డిపేట, కామారెడ్డి జిల్లా
భర్త చనిపోయి నాలుగేండ్లవుతున్నా.
ఎన్నో సార్లు ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరిగాను అయినా లాభం లేదు. పెన్షన్ మంజూరు చేయలేదు. భర్త చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది. పెన్షన్ మంజూరు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెన్షన్ పంపిణీ చేయాలి.
మంజుల, ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా






