06-08-2025 01:42:09 AM
పెద్దపల్లి, ఆగస్టు 5 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా బీజేపీలో వర్గ విభేదాలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎదుటే బయటపడ్డాయి. బీజేపీ అధ్యక్షుడు రాం చందర్‌రావు మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బీజేపీ లీడర్లు రెండు వర్గాలు గా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బీజేపీ రాష్ర్ట అధ్యక్షు డు రాంచందర్‌రావు వెళ్లారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయ నకు గజమాల వేయడానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు వర్గాలకు చెందిన నాయకులు పోటీపడ్డారు. దాంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారించే ప్రయత్నం చేసినా వినకుండా ఇరువర్గాల కార్యకర్తలు తోపులాడుకున్నారు.
జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలోనూ పోటాపోటీగా నినాదాలు చేసి సమావేశాన్ని అడ్డుకున్నారు. ఇదంతా రాష్ర్ట అధ్యక్షుడి ఎదుటే జరగడంతో ఆయన ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో ఇరువర్గాల తీరుపై బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ క్రమశిక్షణగల పార్టీ అని, ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని ఇలా గొడవలకు పోతే కఠిన చర్యలు తప్పవని అధ్యక్షుడు హెచ్చరించారు.
బీసీలకు కాంగ్రెస్ దగా: రాంచందర్‌రావు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. రాష్ర్టంలో బీసీలను దగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, కాంగ్రెస్ పార్టీ కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తూ కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నదని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వలేక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నాటకాలు ఆడుతున్నదని విమర్శించారు.
రానున్న రోజుల్లో బీసీలకు న్యాయం చేసే పార్టీ బీజేపీ అని, తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ రాష్ర్ట నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి తన కార్యకర్తలతో కలిసి రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య, జిల్లా అధ్యక్షుడు కార్రె సంజీవ్‌రెడ్డి, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు, రాష్ర్ట నాయకులు సురెష్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు చందుపట్ల సునీల్‌రెడ్డి పాల్గొన్నారు.