06-12-2025 12:00:00 AM
ఊపందుకున్న ప్రచార పర్వం
గ్రామాల్లో ర్యాలీలతో బల నిరూపణ
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 5 (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగిసింది. రాజకీయ పార్టీలు అన్ని పంచాయ తీల్లో తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించాయి. ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద యథావిధిగా ఉంది. వీరే కాకుండా ఇండిపెండెంట్లుగా మరికొందరు పోటీలో నిలబడ్డారు. వీరితో నామినేషన్లను ఎలా ఉపసంహరింపజేయాలన్న దానిపై ముఖ్య అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.
రెబల్స్కు, స్వతంత్ర అభ్యర్థులకు తాయిలాల ఆశ చూపేందుకు సిద్ధమయ్యారు. ఇక, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం అభ్యర్థులకు పెద్ద టాస్క్గా మారింది. ఓటర్లు దేనికి లొంగుతారో, వారిని ఎలా ప్రలోభాలకు గురిచేయా లన్న ఆలోచనలో మునిగిపోయారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మొత్తం 75 గ్రామ పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
వీటిలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం వంటి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటరు మహాశయులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. గెలుపే ధ్యేయంగా ర్యాలీలు తీస్తూ తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో చతుర్ముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నం మండలంలో బీఆర్‌ఎస్, అబ్దుల్లాపూర్మెట్లో కాంగ్రెస్, మంచాల మండలంలో సీపీఎం, యాచారం మండలంలో బీజేపీ తమ సత్తా చాటాలనుకుంటున్నాయి.
అన్ని గ్రామాల్లో హోరాహోరీ
సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల సింబల్స్ ఉండనప్పటికీ... రాజకీయ వేడి మాత్రం ఖాయంగా ఉంది. ఆయా పార్టీలకు బలమైన పునాదులున్న గ్రామాల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులను రంగంలోకి దించారు. ఆరుట్ల, పోల్కంపల్లి, రాయపోల్, తులేకలాన్, తులేఖుర్దు, మేడిపల్లి, నందివనపర్తి, లోయపల్లి, రంగాపూర్, జాపాల వంటి గ్రామాల్లో హోరాహోరీ పోరు ఉండనుంది.
కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్, మరికొన్ని గ్రామాల్లో బీజేపీ వర్సెస్ సీపీఎం మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఇబ్రహీంపట్నం మండలంలో బీఆర్‌ఎస్, అబ్దుల్లాపూ ర్మెట్లో కాంగ్రెస్, మంచాల మండలంలో సీపీఎం, యాచారం మండలంలో బీజేపీ తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి.
మహిళలకే పెద్దపీట
సర్పంచ్ ఎన్నికల్లో మహిళలకే ప్రభుత్వం పెద్దపీట వేసింది. దాదాపు మెజార్టీ గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల విషయంలో మహిళలకే ప్రాధాన్యం దక్కింది. అన్ని పార్టీలు ఈసారి సింహభాగం యువతకే టికెట్లు కేటాయించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం వంటి పార్టీలు యువ రక్తానికే ప్రాధాన్యమిచ్చాయి.