5 July, 2026 | 2:25 AM

భర్తలను కడ తేర్చిన భార్యలు

05-07-2026 12:43 AM

వేర్వేరు ఘటనల్లో పలువురి అరెస్ట్

మహబూబాబాద్/ ములుగు, జులై 4 (విజయక్రాంతి): వివాహేతర సంబంధాల నేపథ్యంలో కట్టుకున్న భర్తలను కడతేర్చిన ఘటనలు మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వెలుగు చూశాయి. మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన సింగారం గ్రామ మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసులో భార్య సహా ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తెలిపారు. మృతుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భార్య యశోద భర్త యాకయ్యను చంపేందుకు నాలుగు లక్షల రూపాయలను సుపారిగా ఇచ్చి హత్య చేయించింది. యశోద మరో ఆరుగురుతో కలిసి గత నెల 30 న అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో నిద్రిస్తున్న అతన్ని ఇనుపరాడుతో కొట్టి హత్య చేసినట్లు తెలిపారు.

ఈ సంఘటనలో సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల పుటేజి ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అలాగే ములుగు జిల్లాలోనీ జాకారం సమీపంలో జాతీయ రహదారి పక్కన గత నెల 26న జరిగిన హత్య కేసు ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇది కూడా వివాహేతర సంబంధం కారణంగా నే జరిగిందని తేల్చారు.

మృతుడు యాదాద్రి జిల్లా రాజపేట మండల కేంద్రానికి చెందిన సిరిపంగా నరసింహులుగా గుర్తించారు. మృతుడి భార్య శోభారాణి వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడి సహకారంతో ఉరివేసి చంపి కారులో మృతదేహాన్ని తీసుకువచ్చి జాకారం వద్ద పడేసి వెళ్లిపోయారని నిర్ధారించారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నర్సింహులను హత్య చేసిన శోభారాణి, వెంకటేశ్వర్లు, సహకరించిన నీలం దుర్గారెడ్డిని అరెస్టు చేశారు.