07-09-2025 09:29:36 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు 108 సిబ్బంది అంబులెన్స్(Ambulance) లో పురుడు పోశారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మండలం పెద్ద తండకు చెందిన నిండు గర్భిణి నూనావత్ యాకమ్మకు ఆదివారం ఉదయం సమయంలో పురిటి నొప్పులు వస్తుండడంతో సహాయం కోసం 108 అంబులెన్స్ కాల్ చేశారు.
అంబులెన్స్ సిబ్బంది ఇంటికి చేరుకునే సమయంలో యాకమ్మకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది అంబులెన్స్ లోనే యాకమ్మకు కాన్పు నిర్వహించగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డను మెరుగైన వైద్యం కోసం మహబూబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న యాకమ్మను సరైన సమయంలో వైద్య సహాయం అందించిన అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి ప్రభాకర్, పైలెట్ వెంకన్నలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.