22 August, 2026 | 12:45 AM

మహిళను చంపి కారు డిక్కీలో కుక్కి

22-08-2026 12:09 AM
  1. హనుమకొండ జిల్లాలో సంచలనం రేపిన ఘటన
  2. స్నేహితుడే హంతకుడన్న పోలీసులు
  3. వివరాలను వెల్లడించిన డీసీపీ కవిత

భీమదేవరపల్లి/మహబూబాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో కారు డిక్కీలో లభ్యమైన మహిళ మృతదేహం సంచలన ఘటన చిక్కుముడిని పోలీసులు ఛేదించినట్లు శుక్రవారం ప్రకటించారు. హనుమకొండ డీసీపీ ధార కవిత కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీకి చెందిన అంకతి మానస (33) అనే మహిళను ఆమెతో పరిచయం ఉన్న ఎలకతుర్తికి చెందిన వినోద్ అనే వ్యక్తి కరీంనగర్ లో హత్య చేసి శవాన్ని ఆచూకీ లేకుండా చేయడానికి కారు డిక్కీలో వేసి తీసుకువచ్చి మూడు రోజుల క్రితం ఎలకతుర్తి వద్ద నిలిపి ఉంచాడ ని, మృతదేహం కుళ్ళిపోయి దుర్వాసన రావడంతో విషయం బయటకు వచ్చిందన్నారు.

సంఘటనపై ఎలుకతుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టి కారు ఓనరు ద్వారా నిందితుని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని, అతను ఇచ్చిన సమాచారం మేరకు మానసను అతను హత్య చేసి, శవాన్ని కనిపించకుండా చేయాలని భావించాడన్నారు.

నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, మృతురాలి తల్లిదండ్రులు రాజేశం, సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ కవిత తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఆమె వెంట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, సీఐ పులి రమేష్, ఎస్‌ఐ నరసింహారావు, క్లూస్ టీం సిబ్బంది ఉన్నారు.