స్కానింగ్ కోసం వస్తే.. కాటేశాడు!
నిజామాబాద్, మే 28 (విజయక్రాంతి): వైద్యో నారాయణో హరి అంటారు.. భూమి మీద దేవుడి తర్వాత తన వైద్యంతో మనిషిని రక్షించే వ్యక్తిగా డాక్టర్లను భావిస్తారు.. అలాంటి వైద్యుడి వద్దకు చికిత్సకు వెళ్లినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా అన్ని విషయాలు చెప్పేస్తాం. పరీక్షలతో పాటు నమ్మ కంగా, స్కానింగ్ టెస్టులు చేయించుకుంటాం. అయితే ఈ నమ్మకాన్ని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుడు వమ్ము చేశాడు.
టెస్టుల కోసం వచ్చిన మహిళల నగ్న చిత్రాలను తీసి, వారిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. మరికొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశాడు. ఈ విషయం తెలిసిన యాజమాన్యం అతడిని ఉద్యోగంలోంచి తొలిగించి చేతులుదులుపుకొంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వైద్యఆరోగ్య శాఖ అధికారులు నలుగురు వైద్య నిపుణులతో ఓ కమిటీ వేసి విచారణ చేపట్టారు.
ఏం జరిగిందంటే..
నిజామాబాద్‌లోని ఖలీల్‌వాడీలో ఉన్న అయ్యప్ప డయగ్నస్టిక్ సెంటర్‌కు రోజూ ప్రజలు స్కానింగ్ కోసం వస్తారు. ఇక్కడ స్కానింగ్‌తో పాటు వివిధ రకాల టెస్టులు చేస్తారు. అయితే ఈ సెంటర్‌లో స్కానింగ్ ఆపరేటర్‌గా పనిచేసే ప్రశాంత్ ఈ అవకాశాన్ని అదనుగా భావించాడు. మహిళల నగ్న చిత్రాలను తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరించేవాడు. తాను తీసిన చిత్రాలను తన స్నేహితులతో షేర్ చేసుకునేవాడు. ఈ చిత్రాలను చూపించి మహిళలను బ్లాక్ మెయిల్ చేసేవాడని తెలిసింది.
అన్ని సెంటర్లలోనూ ఇంతే..?
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశించారు. డయగ్నస్టిక్ సెంటర్లలో మహిళల చిత్రాలు చిత్రించడం నిజమేనని తేలింది. జిల్లాలో ఈ బాగోతం అయ్యప్ప డయగ్నస్టిక్ సెంటర్‌కు మాత్రమే కాదని, ఇతర సెంటర్లలో కూడా ఇలాగే చేస్తున్నారని విచారణలో తేలింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇక డయగ్నస్టిక్ సెంటర్‌కు పర్మిషన్ ఉందా.. ఒకవేళ ఉంటే ఎవరు ఇచ్చారో తదితర విషయాలపై నివేదిక సమర్పించాలం టూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు.. నిజామాబాద్ డీఎంహెచ్‌ఓ తుకారం రాథోడ్‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో డీఎంహెచ్‌ఓ రాథోడ్ అయ్యప్ప మంగళవారం డయగ్నస్టిక్ సెంటర్‌ను తనిఖీ చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు, ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు నలుగురు వైద్యులతో ఓ కమిటీ వేశారు. ఈ కమిటీలో వివిధ విభాగాలకు చెందిన నలుగురు మహిళా వైద్య నిపుణులు ఉన్నారు.






