29 July, 2026 | 5:21 PM

బీసీ జనగణన మర్చిపోయిన కాంగ్రెస్

29-05-2024 02:06 AM

బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి 

రాష్ట్ర బీసీ మహాసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్

కామారెడ్డి/నిజామాబాద్, మే 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ జనగణనను మర్చిపోయిందని రాష్ట్ర బీసీ మహాసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శించారు. మంగళవారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ఆయన మీడియాతో  మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఆవిష్కరించిందని గుర్తుచేశారు.

బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ గణన చేపట్టి రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామారెడ్డి సభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మాట ఇచ్చారని చెప్పారు. సమావేశంలో బీసీ సంఘ నేతలు అర్కల ప్రభాకర్ యాదవ్, ఏకే బాలాజి, వేణు, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.