19 July, 2026 | 2:55 AM

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

19-07-2026 12:43 AM
  1. శిల్పారామం సమీపంలో ఫిక్కీ ప్రధాన కార్యాలయాలనికి వెయ్యి గజాల స్థలం
  2. మూడు నెలలకు ఒకసారి మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం
  3. ఫిక్కీ మహిళా పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌వో) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నామని, వాటిని త్వరలో ప్రారంభిస్తామని సీఎం తెలిపారు.

ఈ భవనాలను శిక్షణ, మార్కెటింగ్, వ్యాపార కార్యకలాపాలకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైటెక్ సిటీలోని శిల్పారామం సమీపంలో సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్ కోసం కేటాయించినట్లు వెల్లడించారు. అక్కడ మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేకంగా 150కి పైగా దుకాణాలు ఏర్పాటు చేసి గ్రామీణ హస్తకళలు, సంప్రదాయ ఉత్పత్తుల విక్రయానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.

శిల్పారామం సమీపంలో ఫిక్కీ ప్రధాన కార్యాలయం నిర్మించేందుకు వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఫిక్కీకి ఒక ఎకరం స్థలాన్ని కేటాయించి అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఫార్చ్యూన్-500 కంపెనీలను తెలంగాణకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమని అన్నారు.

మహిళల ఇండస్ట్రియల్ పార్క్ తరహాలో మరో పార్క్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారి సమస్యలు, సూచనలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేసినట్లు సీఎం తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తులను అమెజాన్ ద్వారా ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

వ్యాపారాల్లో విశేష ప్రతిభ కనబరిచే మహిళా సంఘాలకు ఫిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అవార్డులు అందించే సంప్రదాయం ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావు, ఎఫ్‌ఎల్‌వో జాతీయ అధ్యక్షురాలు పూజా గర్గ్, హైదరాబాద్ చైర్‌పర్సన్ సీతా రెడ్డి గడ్డం తదితరులు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.