వీగిన మహిళా కోటా బిల్లు
బీజేపీ ట్రాప్‌లో పడిన కాంగ్రెస్
- 131 రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్
- ఓటింగ్ సమయంలో సభలో 528 మంది సభ్యులు
- బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు
- మూడింట రెండు వంతుల ఓట్లు రాకపోవడంతో వీగిన బిల్లు
- అధికారికంగా ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా
- మహిళా కోటా బిల్లు కథ మళ్లీ మొదటికి..
- మిగతా 2 బిల్లుల ఉపసంహరణ
- కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు ప్రకటన
న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౭: కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం పన్నిన పొలిటికల్ ట్రాప్‌లో కాంగ్రెస్ చిక్కుకుపోయిం ది. మహిళలకు ౩౩ శాతం రిజర్వేషన్ల (131వ రాజ్యాంగ సవరణ) బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందదని తెలిసినప్పటికీ.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ వ్యతిరేకమని, ఆ పార్టీని దోషిగా నిలబెట్టాలన్న కేంద్రం టార్గెట్ నెరవేరింది. చట్టసభల్లో మహిళలకు ౩౩ శాతం రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది.
ఈ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులపై తొలుత సభ్యులు ప్రసంగించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. రాజకీయ పార్టీలకు ప్రతినిధులుగా కొందరు సభ్యులు ప్రసంగించిన తర్వాత, రాజ్యాంగ సవరణ బిల్లుపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. స్లిప్‌ల పద్ధతి ద్వారా ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఓటింగ్ సమయంలో సభలో 528 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వేశారు. వ్యతిరేకంగా 230 ఓట్లు వేశారు. మూడింట రెండు వంతుల మెజార్టీ రాకపోవడంతో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు.
ఈ సవరణ బిల్లు వీగిపోవడంతో మిగతా 2 బిల్లులను సైతం కేంద్రం ఉపసంహరించుకున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. బిల్లు ఆమోదం పొందాలంటే, 352 ఓట్లు అవసరం కాగా, బిల్లుకు అనుకూలంగా మరో 54 మంది సభ్యులు ఓటు వేయాల్సి ఉంది. ఇండియా కూటమి సభ్యులందరూ ఒక్కటై.. వ్యతిరేకంగా ఓటు వేసి బిల్లు వీగిపోయేలా చేశారనేది ఓటింగ్ ద్వారా స్పష్టమైంది.
రెండు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లులతో పాటు కేంద్రం ఈ సవరణ బిల్లు తీసుకువచ్చింది. దీనివల్ల 2029 నాటికే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్రం ఆకాంక్షించింది. చివరకు బిల్లు వీగిపోవడంతో మహిళా కోటా బిల్లు కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఓటింగ్ తర్వాత లోక్‌సభను స్పీకర్ శనివారానికి వాయిదా వేశారు.






