29 July, 2026 | 1:04 AM

మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

29-07-2026 12:03 AM

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల (నకిరేకల్) , జులై 28 : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం పేర్కొన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 15, 16, 18, 19, 20 వార్డుల మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను అందించడం ఆనందంగా ఉందన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.21 కోట్ల వ్యయంతో డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.

అలాగే నకిరేకల్ పట్టణానికి 800 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లేక ప్రజలకు పెద్దగా ఉపయోగపడలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి చీరలు, ఇందిరమ్మ ఇండ్ల వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. నకిరేకల్ పట్టణంలో త్వరలోనే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తామని, పట్టణానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా మంజూరైనట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజల ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.