చెయ్యి కాలుతున్నా తీరు మారదా?
డా.తిరునహరి శేషు :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌పై ప్రజలలో అభిమానం ఉన్నా, ఆ అనుకూలతను ఓట్లుగా మార్చే నాయకత్వ వైఫల్యంతో 2014, 2018 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీ ఓటమి చెందక తప్పలేదు. కానీ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్‌రెడ్డి రూపంలో బలమైన నాయకత్వం దొరకటం, మరొకవైపు ఒక దశాబ్దం పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలలో ఏర్పడిన ప్రజా వ్యతిరేకతతో 2023లో మూడవ పర్యాయం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో 64 శాసనసభ స్థానాలలో విజయం సాధించి, అత్తెస రు మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
జాతీయ రాజకీయాలలోనైనా, రాష్ట్ర రాజకీయాలలోనైనా 140 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి, వర్గ రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు, అసమ్మతి దాని సహజ లక్షణం. అయితే కాంగ్రెస్‌లో ఉండే క్రమశిక్షణారాహిత్యాన్ని ఆ పార్టీ తన తప్పిదంగా, వైఫల్యంగా ఎన్నడూ ఒప్పుకోకపోగా, తమ పార్టీ లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని ప్రజలను, దాని సానుభూతిపరులను నమ్మించే ప్రయ త్నం చేస్తుంది.
పార్టీలలో అభిప్రాయ భేదాలు, భేదాభిప్రాయాలు ఉంటే పర్వాలేదు. కానీ, కాంగ్రెస్ లాంటి గ్రాండ్ ఓల్ పార్టీలో శ్రుతిమించే అసమ్మతి, గ్రూపు రాజకీయాలు ఆ పార్టీ ఉనికినే దెబ్బతీశాయనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ గ్రూపు రాజకీయా లు, సొంత పార్టీ ముఖ్యమంత్రులపైనే అసమ్మతి నేతలు నడిపిన రాజకీయాలు అనేక సందర్భాలలో ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీశాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయిలో పెద్దగా గ్రూపులు కట్టి రాజకీయాలు నడిపే నాయకులు లేకపోయినా జిల్లాలలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొ దటి రెండు సంవత్సరాలలో అటు పార్టీలో కాని, ఇటు ప్రభుత్వంలో కాని రేవంత్‌రెడ్డి నాయకత్వానికి ఎదురు లేకుండాపోయింది. రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా పార్టీని విడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కానీ, రెండవసారి మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత మంత్రి పదవులు రాని ఆశావాహుల అసంతృప్తితో అసమ్మతిరాగాలు మళ్లీ మొదలయ్యాయి. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి లక్ష్యంగా కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలతో మరొకసారి కాంగ్రెస్ పాత సం స్కృతి తెలంగాణ ప్రజల గమనంలోకి వచ్చిం ది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మొదలైన అసమ్మతి భవిష్యత్తులో ఏ తీరాలకు చేరుతుందోనని రాజకీయ వర్గాలలో విస్తృతమైన చర్చ జరుగుతున్నది.
ఏ తీరాలకు ఈ అసమ్మతి
ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డిపై అసమ్మతి నివురుగప్పిన నిప్పులాగా కనపడుతున్నది. రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేసే వారి సంఖ్య పార్టీలో రోజురోజుకి పెరిగిపోతున్నది. ఉత్తర తెలంగాణలోని వరంగ ల్, కరీంనగర్ జిల్లాలలో కాంగ్రెస్ బలం పెరగటం, ఈ రెండు జిల్లాల నుంచే 2023 శాసనసభ ఎన్నికలలో 18 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది.
కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు జిల్లాలలో పార్టీ బలహీనపడుతున్నట్లుగా కనపడుతున్నది. కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి పార్టీని వీడటం, వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలు, కొండా సురేఖ వర్సెస్ ఇతర ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి లక్ష్యంగా కొండా సుస్మిత పటేల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు పార్టీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి.
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌కి బలమైన జిల్లా నల్లగొండలో కూడా గ్రూపు రాజకీయాలతోపాటు రాజగోపాల్‌రెడ్డి లాంటి బలమైన నాయకు డు ముఖ్యమంత్రి, ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేయటం కాంగ్రెస్‌కు ఇబ్బందులు కలిగించే అంశాలే. పార్టీలో చేరే సందర్భంగా, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పిన హామీని నెరవేర్చకపోవటం, శాసనసభ ఎన్నికలకు ముందు కొండా మురళీధర్‌రావుకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే వాగ్దానం కార్యరూపం దాల్చకపోవటంతో రాజగోపాల్‌రెడ్డి, కొండా సుష్మిత పటేల్ ముఖ్యమంత్రి లక్ష్యంగానే విమర్శలు ఎక్కుపెట్టారు.
భవిష్యత్తులో ఈ విమర్శల తీవ్రత పెరిగినా, విమర్శించే వారి సంఖ్య పెరిగినా ముఖ్యమంత్రి నాయకత్వం బలహీనపడటమే కాదు.. ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని విమర్శించే అస్త్రాలు ఇచ్చినట్లు అవుతుంది. గత బీఆర్‌ఎస్ పాలనలో కూడా యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్‌గా పార్టీ విడిపోవడం, నిజమైన ఉద్యమకారులకు ప్రభుత్వంలో పదవులు దక్కకపోవడం అసంతృప్తికి దారితీసి బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం చేసింది.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్, హస్తం కాంగ్రెస్ అనే వర్గాలు ప్రభుత్వంలో స్పష్టంగా కనపడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సైకిల్ కాంగ్రెస్‌కి ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయనే అసంతృప్తి హస్తం కాంగ్రెస్‌లో ఉన్నా అది పూర్తిస్థాయిలో బయటపడటం లేదు. పార్టీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల నాటికి కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతింటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హామీల అమలులో ఎదురీత
ఒకవైపు పార్టీలో అసమ్మతి, అసంతృప్తు లు, మరొకవైపు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు, హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, కీలక మంత్రులపై అవినీతి ఆరోపణలు, ముఖ్యమైన పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ లాంటి శాఖలలో అధికారుల అవినీతి, కళ్యాణలక్ష్మి పథకం నిలిపివేత, 22ఏ భూము ల వివాదం, ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాటపట్టాలని నిర్ణయించుకోవటం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విపరీతమైన అప్పుల వల్ల ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
మహిళలను ప్రసన్నం చేసుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా మహాలక్ష్మి పథకంలో భాగంగా నెలకి రూ. 2500 ఇవ్వకపోవడం మహిళలలో, ఉద్యోగాల భర్తీలో పురోగతి లేకపోవడం వలన నిరుద్యోగ యువతలో, రైతు భరోసా లాంటి పథకాన్ని గతంలోలాగా అమలు చేయకపోవడం, వ్యవసాయానికి సకాలంలో నీళ్లు అం దించడంలో వైఫల్యంతో రైతులలో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
ఎదురుదాడే అస్త్రం!
నిజానికి ముఖ్యమంత్రితో సహా కీలక శాఖలైన హోం, విద్య, పురపాలక, రెవెన్యూ, ఆర్థిక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు నిర్వహించే మంత్రులకి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం లేకపోవడం వలన ఆయా శాఖల పనితీరు సంతృప్తికరంగా లేదు. వ్యవసాయ శాఖ మంత్రికి అనుభవం ఉన్నా, ఆ శాఖ పనితీరు కూడా అంతంతమాత్రమే. ముఖ్యమంత్రి తన ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోటానికి వేదిక ఏదైనా ఇప్పటికీ గత ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నారనే అభిప్రాయాలు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.
తన ప్రభుత్వ ప్రాధాన్యతల కంటే కేసీఆర్‌ను విమర్శించడానికి ముఖ్యమంత్రి మొగ్గుచూపుతున్నారు. 90వ దశకం తర్వాత ఒక్క మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా వరుసగా రెండవసారి అధికారంలోకి రాలేదు. దీంతో 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటాననే రేవంత్ రెడ్డి మాటలను కూడా ఎవరూ విశ్వసించ టం లేదు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఇటీవల తమిళనాడు, కేరళం రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో స్టాలిన్, పినరయి విజయన్ ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేసినా ఎన్నికలలో ఓటమి తప్పలేదు. మరి ఇన్ని ఆరోపణలు, వైఫల్యాలు అసంతృప్తి, అసమ్మతి ఉన్న రేవంత్‌రెడ్డి ప్రభు త్వ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ప్రజలే నిర్ణయిస్తారు? 2023 శాసనసభ ఎన్నికలకు ముందు ‘కాంగ్రెస్ గెలుస్తుందని’ ప్రజలు మాట్లాడుకుంటే, 32 నెలల కాంగ్రెస్ పాలన తరువాత ‘కాంగ్రెస్ గెలవదు’ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వలన ప్రజాభిప్రాయం వారి అధికార గోడలను దాటి చేర డం లేదు.ప్రజల అసంతృప్తి వారికి చేరే నాటి కి జరగాల్సిన నష్టం కూడా జరిగిపోతుంది.
వ్యాసకర్త: 9885465877






