21 May, 2026 | 1:45 AM

గిరిజనుల సంక్షేమానికి కృషి

19-06-2024 01:02 AM
  • ఐటీడీఏ పనితీరులో మార్పు తీసుకొస్తాం
  • ఎస్టీలకు మెరుగైన సేవలు అందించాలి
  • పంచాయతీరాజ్‌శాఖ మంత్రి  సీతక్క

జయశంకర్ భూపాలపల్లి (ములుగు), జూన్ 18 (విజయక్రాంతి): గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి దనసరి అనసూయ అలియాస్ సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో మంగళవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. అనంతరం పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో సంబంధిత అధికారు లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. గిరిజన ప్రాంత ప్రజలకు ఐటీడీఏ రక్ష అని, కానీ ఐటీడీఏ అంత క్రియాశీలకంగా పనిచేయకపోవడం బాధాకరమ న్నారు. నిబద్ధతతో పనిచేయలేని వారు బదిలీపై వెళ్లిపోవచ్చని, సంతృప్తిగా పనిచేయా లనుకునే వారు మాత్రమే ఇక్కడ ఉండాలన్నారు.

గతంలో పీవోగా పనిచేసిన ఐటీడీఏ శర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. ఇక్కడ ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారం పీవోకు ఉంటుందదన్నారు. ఏజెన్సీని అకాడమిక్ హబ్‌గా మా ర్చాల్సిన అవసరం ఉందన్నారు.  రాష్ట్ర  సరిహాద్దు ప్రాంతం కావడంతో ఛత్తీస్‌గఢ్ నుంచి గంజాయి రవాణా అవుతుందని, గంజాయిను కట్టడి చేసేందుకు  పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.

సమీక్షా సమావేశంలో ఆయా శాఖల జిల్లాస్థాయి అధికా రులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మంత్రి మంగపేట మండలం నర్సింహసాగర్ గ్రామానికి వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. మంత్రి వెంట కలెక్టర్ దివాకర ఉన్నారు. తర్వాత చిన్నబోయినపల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన అంగన్‌వాడీ టీచర్ కుటుంబానికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.50 వేల చెక్కును అందించారు.