పటాన్‌చెరు వరకు మెట్రోను పొడిగించాలి
హెచ్‌ఎంఆర్‌ఎల్‌ను కోరిన ఎంపీ రఘునందన్
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ప్రజల సౌకర్యార్థం మెట్రో మార్గాన్ని మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు పొడిగించాలని బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక కారిడార్‌గా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రవాణా ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోందన్నారు. ఫలితంగా ప్రమాదాలు కూడా పెరిగినట్లు రఘునందన్ పేర్కొన్నారు. ట్రాఫిక్ దృష్ట్యా మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు మెట్రో మార్గాన్ని పొడిగించాలని కోరారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ తగ్గి.. ప్రయాణీకుల భద్రత కూడా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.






