3 April, 2026 | 6:42 PM

గాయానికే శిక్ష..?

03-04-2026 05:12 PM

- గాయపడిన కార్మికులకు సస్పెండ్లు

- గని ప్రమాదాలపై అధికారుల తీరు

- సుగేరేణిలో అధికకారుల దాస్టికం

- పట్టించుకొని కార్మికసంఘాలు

- కార్మికులకుపై అణిచివేత

- ఇదీ నేటి సింగరేణి ముఖచిత్రం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణిలో అన్యాయాలు, దాస్టికాల పర్వం కొనసాగుతుంది. న్యాయం ధర్మం అనే పదానికి కాలం చెల్లిపోయింది. కార్మికులు గడ్డు పరిస్థితుల్లో కాలం అధికారుల వెళ్లదీస్తున్నారు. తప్పులు అధికారుల వైయినా శిక్షలు కార్మికులకు వేస్తున్నారు. కార్మికులు  బలిపశువు లను చేస్తున్నారు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అధికారులు కార్మికులపై అక్రమ చర్యలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి పరిస్థితి సింగరేణిలో ప్రతి గనీలో ప్రతి కార్మికుడు ప్రతిరోజూ ఎదుర్కొంటున్నాడు. అందుకు శాంతి గనిలో జరిగిన  సంఘటనలే ఉదాహరణ.

ఇటీవల శాంతిఖనిలో విధి నిర్వహణలో బదిలీ వర్కర్ కోట మనికేశ్వర్ చేతికి గాయమైంది. ఈ సంఘటనలో కార్మికుడి చేతి వేలు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదాన్ని అధికారులు గని ప్రమాదంగా నమోదు చెయ్యలేదు. సదరు కార్మికుడిని అధికారులు బెదిరించి దాటవేశారు. గాయపడిన కార్మికుడు గని ప్రమాదంగా నమోదు చేయాలని గొడవ చేశారు. అయినప్పటికీ అధికారులు  ససేమిరా అన్నారు. వినలేదు. చేసేదేమి లేక కార్మికుడు సింగరేణి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. ఇదే విషయం పై "విజయ క్రాంతి దిన పత్రికలో మార్చి 22న తేదీన "కార్మికుల ప్రాణాలతో చెలగాటం " అనే శీర్షిక తో వార్త కథనం ప్రచురితమైన  సంగతి తెలిసిందే. 

దీంతో ఉన్నతాధికారులు దిగివచ్చి గని అధికారులపై మండిపడ్డారు. అధికారుల్లో కదలిక స్పందన వచ్చింది. ఈ విషయంలో జిఎం రాధాకృష్ణ  డైరెక్టర్ నుంచి చివాట్లు తిన్నారని సమాచారం.. వెంటనే జీఎం శాంతిఖనిలో దిగి ఘటనా స్థలిని సందర్శించారు. ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు స్థానిక అధికారులు  గనీ ప్రమాదం కింద నమోదు చేయాల్సి వచ్చింది. పై అధికారుల ఆదేశాల మేరకు గని ప్రమాద వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కార్మికుడికి న్యాయం జరిగిందని భావించారు.

- యాక్సిడెంట్ కార్మికుడు సస్పెండ్..

రక్షణ చర్యల లోపం వల్ల గనిలో చోటుచేసుకున్న యాక్సిడెంట్ ఘటనా మల్లి మొదటికే చేరింది. ఈ సంఘటన జరిగి పక్షం రోజులు గడిచిన తరువాత అదే కార్మికుడికి గని అధికారులు సస్పెండ్ చేశారు. గని ప్రమాదంగా చేసిన కేసు అనూహ్యంగా తలకిందులైoది. ప్రమాదం కార్మికుడి  నిర్లక్ష్యం వల్లనే జరిగిందని అందుకు ఆయన  తప్పిందమనే పేరుతో చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇదెక్కడి న్యాయమని బాధితుడు, యావత్తు గని కార్మికులు లబోదిబోమంటున్నారు.

దెబ్బతగిలిన కార్మికుడికి న్యాయం చేయాల్సిన అధికారులు, అందుకుగల అధికారిపై  చర్యలకు బదులు  ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగడంతో శాంతిఖని కార్మికుల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. తొలుత  గని ప్రమాదమనీ నమోదు చేసిన రిపోర్టు  మారిపోయింది. వ్యక్తిగత నిర్లిప్తత వల్లనే చేతికి గాయమైందని రక్షణ అధికారుల తప్పిదాలను కార్మికుడిపైనే నెట్టివేశారు. అందుకుగాను 10 రోజులు సస్పెండ్ చేస్తూ కార్మికుడికి లెటర్ ఇవ్వడం గని అధికారుల అంతులేని దాష్టికానికి పరాకాష్టగా మారింది. అధికారుల రక్షణ చర్యల నిర్లక్ష్యం వల్ల జరుగుతోన్న గని ప్రమాదాలకు కార్మికులనే కారకులను చేసి అధికారులు తమకు ఎదురులేనదని  విర్రవవీగుతున్నారనీ ఆగ్రహవేషాలు వినిపిస్తున్నాయి.

- ఎందుకిలా చేస్తున్నారు..?

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కంటే.. అధికారులు తమ ఉద్యోగ భద్రతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకా ఓపెన్ గా, స్పష్టంగా చెప్పుకోవాలంటే పర్యవేక్షణ పనితీరు, తమ ఖ్యాతిని కాపాడుకోవడానికి అడ్డగోలుగా తప్పులు చేస్తున్నారు. ప్రమాద రహిత సింగరేణి గా నడిపించాలని గొప్పలకు కార్మికులను బలితీసుకుంటున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాద రహిత సింగరేణి గా మార్చడం  అంటే ప్రమాదాలకు అవకాశం ఇవ్వకుండా రక్షణ చర్యలు  పటిష్టంగా అమలు చేయాలి. అలా చేయడం వల్లనే సాధ్యం పడుతుంది. ఇది జరగాలి.

అంతేకానీ  జరిగిన ప్రమాదాలను నమోదు చేయకుండా దాచిపెట్టి కార్మికుల్ని ప్రలోబపెట్టీ, అధికార బలంతో అవసరమైతే బెదిరించి కార్మికుల గొంతు నొక్కడం, ప్రమాదాలను కప్పిపుచ్చడం కాదు. ప్రమాదాలు జరగకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటేనే సింగరేణిలో ప్రమాదాలు జరుగవు. మానవ తప్పిదాల వల్ల అంటే అధికారుల రక్షణ చర్యల లోపం కారణంగా జరిగే ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పడుద్ది. తద్వారా ప్రమాద రహిత సింగరేణి లక్ష్యం  నెరవేరుతుంది. అంతేకాదు  ప్రమాద రహిత బొగ్గు ఉత్పత్తి, కార్మికుల ప్రాణాలకు భరోసా, సింగరేణి సంస్థ పురోగమనానికి అవధులు తొలగిపోతాయి.

అంతే కానీ జరుగుతున్న గని ప్రమాదాలను రిపోర్టు చేయకుండా  కార్మికులను ఆదరించి, బెదిరించి కప్పిపుచ్చడంతో ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ దిశగా సింగరేణి యాజమాన్యం చిత్తశుద్దిగా ఇప్పటివరకూ ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. ఫలితంగా సింగరేణిలో కార్మికుల ప్రాణాలు బొగ్గు ఉత్పత్తి కి బలిచేస్తున్నారు. సింగరేణిలో ఇదో రకమైన రక్తపాతం అని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల దాహానికి కార్మికుల నిండు ప్రాణాలను అర్పిస్తున్నారన్న ఆరోపణలు కాదనలేనివి.

ఎలాంటి రక్షణ చర్యలు లేని బొగ్గు గనుల్లో కార్మికులతో బొగ్గు ఉత్పత్తి  చేయించడం  ఎంతవరకు కరెక్టు అన్నది  జవాబులేని ప్రశ్న.  కడుదుర్భర, ప్రమాదకర  పరిస్థితుల్లో సింగరేణి కార్మికులు మగ్గుతుంటే కార్మిక సంఘాల పరిస్థితి "చెవి టోనీ ముందు శంఖం ఊదిన చందంగా" ఉంది. తమ సొంత పనులు చేసుకోవడం మేరకే సింగరేణి సంఘాలు పరిమితమయ్యాని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణిలో జరుగుతోన్న సకల అన్యాయాలకు కార్మిక సంఘాలే ప్రధాన కారణమని కార్మికులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఇలా అయితే సింగరేణిలో కార్మికులకు దిక్కెవరన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్నగా మిగిలి పోయింది.