9 June, 2026 | 2:31 AM

నిజాయితీగా పనిచేస్తే హిట్

09-06-2026 01:13 AM

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నుంచి వచ్చిన తాజాచిత్రం ‘పెద్ది’. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ‘థాంక్ యూ’ ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. “ఇష్టపడి, ప్రేమిస్తూ ఒక పని చేస్తూ ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమను పొందడం సర్‌ప్రైజింగ్‌గా వుంది. ఇది ఎవరో పుష్ చేస్తే చేసిన సినిమా కాదు. బుచ్చిబాబు చెప్పిన కథను నమ్మి ఈ సినిమా చేసినందుకు నాకు ఎంతో సంతృప్తిగా ఉంది.

నా సినీ లైబ్రరీలో నెంబరు 1, 2గా నిలిచే సినిమా ఇది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే, వాళ్లు ఈ సినిమాను స్వీకరించిన తీరు చూస్తుంటే, ఎవరైనా మనస్ఫూర్తిగా, నిజాయితీగా పని చేస్తే అది రేజర్ ఎడ్జ్ సినిమా అయినా, కమర్షియల్ సేఫ్ జోన్ సినిమా అయిన తప్పకుండా హిట్ కావాల్సిందే” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జగపతిబాబు, డైరెక్టర్ బుచ్చిబాబు సానా, నిర్మాతలు రవిశంకర్, వెంకట సతీశ్ కిలారు, డిస్ట్రిబ్యూటర్ శశిధర్‌రెడ్డి, గీత రచయిత అనంత శ్రీరామ్ కూడా మాట్లాడారు.