సందిగ్ధంలో ‘యాదాద్రి’ ప్లాంట్

20-04-2024 12:30:00 AM

l పవర్ ప్లాంట్ ప్రారంభమయ్యేనా?

l కేంద్రం అనుమతుల కోసం నిరీక్షణ

l ప్రారంభిస్తే విద్యుత్తు కొరత నుంచి ఊరట 

l ఇప్పటికే పూర్తయిన రైల్వే లైన్ల నిర్మాణం

నల్లగొండ, ఏప్రిల్ ౧9 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యుత్తు సమస్యలు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో అందరి దృష్టి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుపై పడింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మితమైన ఈ పవర్ ప్లాంటు.. ప్రారంభానికి కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తున్నది. ప్రస్తుత మంత్రివర్గం పరిశీలన చేసి ప్రారంభిస్తాం అనే ప్రకటనలకు పరిమితమైంది. థర్మల్ పవర్ ప్లాంటు ప్రారంభానికి కేంద్రం అనుమతులు రావాల్సి వుంది. అప్పటి విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అనుమతుల కోసం పలు పర్యాయాలు కేంద్రానికి వినతులు కూడా ఇచ్చారు. 

మొదటి దశలో రెండు యూనిట్లు ప్రారంభించి ఈ ఏడాది జూన్ నాటికి 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంది. ఆ దిశగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కేంద్రం కూడా దీనిపై మీనమేషాలు లెక్కిస్తున్నదని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రస్తుత విద్యుత్తు సంక్షోభాన్ని నివారించాలంటే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ప్రారంభించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

౯౦ శాతం పనులు పూర్తి..

విద్యుత్తు రంగంలో స్వయం సమృద్ధి సాధించే దశగా 2016లో అప్పటి ప్రభుత్వం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నాలుగు వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. 2018 లో పనులు ప్రారంభించి ఇప్పటివరకు ౯0 శాతానికి పైగా నిర్మాణం పూర్తిచేసింది. యాదాద్రి సూపర్ క్రిటికల్ అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణంతో నల్లగొండ జిల్లాలో ఒక పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపం లో నల్లమల్ల అటవీప్రాంతంతో సులువైన భూసేకరణ, కృష్ణ నదీజలాలు, రవాణా, రైల్వే లైను సదుపాయాలతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. థర్మల్ పవర్ ప్లాంటుకు అనుగుణంగా బొగ్గు రవాణాకు కృష్ణ పట్నం ఓడ రేవు ద్వారా రోడ్డు, రైల్వే మార్గాల ద్వారా బొగ్గు రవాణాకు అనువైన ప్రదేశం గా గుర్తించారు. ఇప్పటికే విద్యుత్ లైన్ల నిర్మా ణం, పవర్ గ్రిడ్‌కు అనుసంధానించే లైన్ల నిర్మాణం, గ్రిడ్ యార్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 

పెరిగిన అంచనా వ్యయం

800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు యూనిట్ల నిర్మాణం చేపట్టారు. జెన్‌కో, భెల్ సంయుక్త భాగస్వామ్యంలో విద్యుత్తు ప్లాం టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. థర్మల్ కేంద్రాల నుంచి వచ్చే కాలు ష్యాన్ని నివారించే విధంగా ఈ కేంద్రాల్లో ఫ్లూగ్యాస్ డీ సల్పైరైజేషన్ (ఎఫ్ జీ డీ) ప్రక్రియను వాడుతున్నారు. దీంతో అనుకున్న దానికంటే అంచనా వ్యయం రూ.4,658 కోట్లు పెరిగింది. ఈ కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం గల ఐదు టర్భయిన్లను భెల్ నిర్మిస్తోంది. అవసరమైన రూ.30 వేల కోట్ల నిధులను జెన్‌కో బ్యాం కుల నుంచి రుణాల రూపేణ సేకరించింది. ఇప్పటికే పెరిగిన వ్యయంతో రూ.34,400 కోట్లకు చేరింది. 2024లో జూన్ వరకు 2 యూనిట్లు ప్రారంభించే దిశగా పనులు సాగుతున్నాయి. 

అనుమతులే తరువాయి..

విద్యుత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇస్తే ఈ వేసవిలో విద్యుత్తు అవసరాలు తీరే అవకాశం ఉంది. నిర్మాణ వ్యయం పెరగకుండా యాదాద్రి పవర్ ప్లాంటు వినియోగంలోకి వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం పేర్కొంది. విద్యుత్తు ఉత్పత్తి ద్వారా విడుదలయ్యే కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ప్రాజెక్టుకు కేటాయించిన భూమిలో 40 శాతాన్ని గ్రీన్ బెల్ట్‌కు కేటాయించారు. ఈ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి 5 వేల ఎకరాలు సేకరించగా ఇందులో 2 వేల ఎక రాల్లో మొక్కలు పెంచునున్నారు. బొగ్గు రవాణా కోసం సమీపంలోని విష్ణుపురం రైల్వే స్టేషన్ నుంచి 8 కి.మీ దూరంలో ఉన్న ప్రాజెక్టుకు ప్రత్యేక రైల్వే లైను ఏర్పా టు చేశారు. 

ప్లాంటుకు అవసరమైన నీటి అవసరాల కోసం 3.1టీఎంసీ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించారు. సమీపంలో కృష్ణా నది నుం చి 2.5 కిలోమీటర్ల పైపులైను ద్వారా ఈ రిజర్వాయర్‌ను నింపను న్నారు. యాదాద్రి పవర్ ప్లాంటు నుంచి వెల్లడయ్యే బూడిదను నిల్వ చేయడానికి 420 ఎకరాలు కేటాయించారు. అందు లో యాష్ పాండ్‌ను ఏర్పాటు చేశారు. సమీపంలోనే పలు సిమెంటు పరిశ్రమలు ఉండటంతో బూడిద నిల్వపై సందేహాలు అవసరం లేదని స్థానిక అధికారులు వెల్లడించారు.