calender_icon.png 12 November, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యమకింకర డాక్టర్లు!

12-11-2025 12:38:37 AM

ఢిల్లీ కారు పేలుడుకు సూత్రధారి ఫరీదాబాద్ డాక్టర్ ఉమర్

  1. నలుగురు వైద్యుల అరెస్టుతో భయపడి ఆత్మాహుతి దాడి
  2. కుట్రదారులను వదిలిపెట్టం: ప్రధాని మోదీ

నూఢిల్లీ, నవంబర్ 11: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం రాత్రి కారు లో పేలుడు సంభవించి 1౨ మంది మృతిచెందగా, పలువురు గాయపడిన కేసు కీలక మలుపు తిరిగింది. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని అల్ ఫలా మెడికల్ కాలేజీలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఉమర్ ఆత్మాహుతికి పాల్పడ్డాడని నిఘా వర్గాల విచార ణలో తేలింది. గుజరాత్, హర్యానా, జమ్మూకశ్మీర్ విస్తృతంగా దాడులు నిర్వహించి సోమవారం ఉగ్రవాద వ్యతిరేక బృందా లు నలుగురు డాక్టర్లను అరెస్ట్ చేసిన కొద్దిగంటలకే ఢిల్లీలో డాక్టర్ ఉమర్ ఆత్మాహుతికి పాల్పడడం చర్చనీయాంశమైంది.

కారు పేలుడు ఘటనపై మొదట ఢిల్లీ పోలీసులు తొలుత ఉపా చట్టం, ఎక్స్‌ప్లోజివ్స్ సెక్షన్ల కింద కేసులు నమో దు చేశారు. సాధారణంగా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులను నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ ఐఏ) దర్యాప్తు చేస్తుంది. దీనిలో భాగంగానే కేంద్ర హోమంత్రిత్వశాఖ మంగళ వారం ఈ కేసును నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి అప్పగించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండుసార్లు సమావేశం నిర్వహించారు.

ఢిల్లీ పేలుడు ఘటనతోపాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతకు సంబంధించి సమీక్షించారు. పేలుడు ఘటనపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని, విధ్వంసంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, వారికి చట్టపరంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటా మని ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రకటించారు.

పేలుడు ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న ఉమర్‌కు కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో గత వారం అరెస్టున మరో అదీల్ అహ్మద్ రథర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. పట్టుబడిన వైద్యులంతా ఉగ్రవాదులకు వివిధ మార్గాల్లో నిధులు సమకూరుస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే నలుగురు డాక్టర్ల అరెస్ట్..

భద్రతా దళాలు గుజరాత్, హర్యానా, జమ్మూ కశ్మీర్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించి ఉగ్ర కుట్రలో అనుమానితులుగా ఫరీదాబాద్‌లో ఆల్ ఫలాయ్ యూనివర్సిటీ అధ్యాపకుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, జమ్మూకశ్మీర్‌కు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రథర్, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహమ్మద్ మోహియుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా డాక్టర్ షాహిన్‌ను అరెస్ట్ చేశాయి.

వీరి నుంచి 2,900 వందల కిలోల పేలుడు పదార్థాలు, రైఫిళ్లు, పిస్టల్స్, రైసిన్, అమోనియం నైట్రేట్ పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామం జరిగిన గంటల వ్యవధిలోనే ఢిల్లీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. పట్టుబడిన వారంతా డాక్టర్ ఉమర్‌కు సన్నిహతులు కావడం, అతడు ఆందోళనకు గురయ్యాడని, ఈక్రమంలో పరారయ్యేందుకు ప్రయత్నిస్తూ ఆత్మహుతి దాడి చేసి ఉంటాడని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

సీసీ కెమెరాలో దృశ్యాలు..

విచారణలో భాగంగా ఢిల్లీలోని అనేక చోట్ల సీసీ కెమెరా ఫుటేజీలను దర్యాప్తు బృందాలు పరిశీలించాయి. ‘హ్యుందాయ్ ఐ20’ కారు ఉదయం 8:04 గంటలకు ఫరీదాబాద్ వైపు నుంచి బదర్‌పూర్ టోల్ ప్లాజా నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది. అలా ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతం, దర్యా గంజ్, కశ్మీర్ గేట్ వంటి రద్దీ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టింది. మధ్యాహ్నం 3:19 గంటలకు ‘సనైరి’ మసీదు పక్కన ఉన్న పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించింది.

సాయంత్రం 6:22 గంటల వరకు కారు అక్కడే పార్క్ చేసి ఉంది. ఈ సయమంలో నిందితుడు రెక్కీ నిర్వహించి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సాయంత్రం 6:30కి కారు పార్కింగ్ స్థలం నుంచి బయటకు వచ్చింది. రాత్రి 6:45 గంటలకు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ సమీపంలో పేలుడు సంభవించింది. ఉమర్ కారు నడుపుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ కారు సోమవారం అరెస్టయిన నిందితుడు మహమ్మద్ సల్మాన్ పేరుపై ఉందని విచారణలో తెలింది.

కారు క్రమక్రమంగా అనేకమంది చేతులు మారి ఆమిర్, తారిఖ్ వద్దకు చేరింది. వీరిద్దరూ సోమవారం అరెస్టయ్యారు. చివరికి కారు ఉమర్‌కు వద్దకు చేరినట్లు దర్యాప్తులో తేలింది. పేలుడు జరిగిన సమయంలో కారు నడిపిన వ్యక్తి గుర్తింపును నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ బృందాలు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఎర్రకోట ప్రాంతంలో మసీదు ఉండటంతో సాధారణంగా ఆ  ప్రాంతం ప్రతిరోజు సాయంత్రం అత్యంత రద్దీగా ఉంటుంది.

అలాంటి ప్రదేశంలో సాయంత్రం పేలుడు సంభవించడం తీవ్రతను పెంచింది. పేలుడు కోసం నిందితుడు అమ్మోనియం నైట్రేట్ ఆయిల్‌ను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు ఉమర్ మరో ఇద్దరు సహచరులతో కలిసి పేలుడుకు ప్లాన్ చేసినప్పటికీ, ఆఖరి నిమిషంలో భయపడి తానొక్కడే ఒంటరిగా ఆత్మాహుతికి పాల్పడ్డాడడని సమాచారం.

దర్యాప్తు వేగవంతం

పేలుడు ఘటన తర్వాత ఢిల్లీ పోలీసులు ఇప్పటికే 13 మంది అనుమాని తులను అదుపులోకి తీసుకున్నారు. జ మ్మూ కశ్మీర్‌లో ఇప్పటికే నిందితుడు ఉమర్ తల్లి షహీమా బానోతో పాటు అతడి సోదరులు ఆషిక్, జహ్రూర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే షోపియాన్‌కు చెందిన ఇమ్రా న్ అలియాస్ మౌల్వితోపాటు పుల్వామాకు చెందిన తారిఖ్ అహ్మద్ దార్ అనే వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

విచారణలో భాగంగా ఫరీదాబాద్‌లో భారీ మొత్తంలో పేలుడు (ఐఈడీ తయారీ) పదార్థాలు   స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ముజామిల్ షకీల్ అరెస్టు త ర్వాతే ఉమర్ ఆత్మాహుతి దాడికి ఒడిగట్టి ఉండొచ్చని  దర్యాప్తు బృందం భావిస్తున్నది. మరోవైపు పేలుడు జరిగిన చోట పోలీసులు  తొమ్మిది మృత దేహాలను గుర్తించారు. వాటిలో ఇప్పటివరకు ఇద్దరి వివరాలు మాత్రమే గు ర్తించి, మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించారు. మిగిలిన వారి గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.