ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం
హైదరాబాద్, మే 13(విజయక్రాంతి): వచ్చే రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం హనుమకొండ జిల్లాలోని ఆత్మకూర్‌లో 128.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా సుగ్లంపల్లిలో అత్యధికంగా 42.7 డిగ్రీలు, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండలో 20.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.
రానున్న మూడు రోజుల్లో అత్యధికంగా 38 నుంచి 41 డిగ్రీలు, అత్యల్పంగా 24 నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మేడ్చల్, జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు, గ్రేటర్ వ్యాప్తంగా రామచంద్రాపురం 22 సర్కిళ్లలో 7.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.




