8 April, 2026 | 11:23 PM

783 మంది ఓటర్లు.. పోలైన ఓట్లు ఆరు

14-05-2024 01:37 AM

ఎన్నికలు బహిష్కరించిన మైలారం గ్రామస్తులు

అచ్చంపేట, మే13: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మైలారంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందని గ్రామస్తులు గొంతెత్తారు. ప్రైవేటు కంపెనీ ప్రకృతిని, తమ వనరులను ధ్వంసం చేస్తున్నదని ఆక్రందన చేశారు. మైనింగ్‌ను ఆపాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు పదుల సంఖ్యలో వినతులు అందించారు. అదిగో.. ఇదిగో అంటున్నారు కానీ ఎవరూ సమస్య గురించి  పట్టించుకోలేదు. మైనింగ్ ఆపకపోతే లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తామని ఇటీవల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినా.. యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేదు.

చివరకు అన్నంత పనిచేశారు. సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు వెళ్లమని ఉదయం నుంచి సాయంత్రం వరకు భీష్మించుకుని కూర్చున్నారు. సమాచారం అందుకున్న అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో మాధవి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్తులు వినలేదు. చివరకు పొరుగు గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఆరుగురు ఓటు వేయాల్సి ఉండగా, ఆర్డీవో వారిని ప్రత్యేక వాహనంలో పోలింగ్ కేంద్రానికి పంపించి ఓటు వేయించారు.