26 July, 2026 | 2:15 AM

చెట్టేక్కితేనే సిగ్నల్!

26-07-2026 12:00 AM
  1. ఏజెన్సీలో గ్రామాలకు అందని నెట్‌వర్క్ సేవలు
  2. సంక్షేమ పథకాలకు ఆటంకం

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఆధునిక సమాజంలో ప్రతి పనికి ఇప్పుడు సెల్ ఫోన్ ఒక ప్రధాన సాధనంగా మారిపోయింది. వ్యక్తిగత అవసరాల నుంచి మొదలుకొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కోసం సెల్ ఫోన్ ఇప్పుడు తప్పనిసరి వినియోగమైంది. అయితే మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటివరకు కూడా కొన్ని మారుమూల గ్రామాల ప్రజలకు సెల్‌ఫోన్ వినియోగం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.

దీంతో కొత్తగూడా, గంగారం, గూడూరు, బయ్యారం మండలాల్లోని మారుమూల గ్రామాల ప్రజలు సెల్ఫోన్ వినియోగానికి సిగ్నల్ వచ్చే ఒక ప్రదేశానికి వెళ్లడం, లేదంటే చెట్లు, గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా మండలాల్లోని పూనుగొండ్ల, కార్లాయి, ఓటాయి, మహదేవుని గూడెం, మడగూడెం, నేలవంచ, దొరవారి తిమ్మాపు రం తదితర గ్రామాల్లో కొన్నిచోట్ల మాత్రమే వివిధ సెల్ఫోన్ టవర్లకు చెందిన నెట్వర్క్ కొంతమేర అందుబాటులో ఉంటుంది.

దీంతో ప్రజలు తమ క్షేమ సమాచారం ఇతరుల కు చేరవేయాలన్నా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్లి సెల్ ఫోన్ చేత పట్టుకొని చెట్టు పైకి ఎక్కి తమ సమాచారాన్ని తెలిపిన తర్వాత మళ్లీ తిరుగు ముఖం పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమానికి సెల్‌ఫోన్ లింక్ చేయడంతో వీటి వినియోగం తప్పనిసరిగా మారింది. యూరియా పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, తాజాగా సర్ కార్యక్రమం పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా అప్లోడ్ చేయడానికి ఏజెన్సీ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో నెట్‌వర్క్ సమస్య తీవ్ర ఆటంకం కలిగిస్తోంది.

ఇంతకాలం మావోయిస్టుల ప్రాబల్యం కారణంగా ఏజెన్సీలో చాలా మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్లను నిర్మించడానికి వెనుకంజ వేశారు. ఆపరేషన్ కగార్‌తో వారి ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో సెల్ఫోన్ టవర్ల నిర్మాణానికి పెద్దగా ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అటవీశాఖ, రెవెన్యూ, ఇతర విభాగాలకు చెందిన భూములను గుర్తించి నెట్‌వర్క్ గిరిజన ప్రాంతాలకు విస్తరించే విధంగా అనువైన ప్రదేశంలో సెల్ టవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కాగా మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో సెల్ సిగ్నల్ లేని ప్రాంతాల్లో నెట్‌వర్క్ విస్తరించేందుకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ దృష్టి సారించారు. అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల వివిధ సెల్‌ఫోన్ ప్రొవైడర్లు ఎయిర్‌టెల్, జియో, బీఎస్‌ఎన్‌ఎల్, వోడాఫోన్, ఐడియా తదితర కంపెనీల ప్రతినిధులతో ఏజెన్సీలో సెల్‌ఫోన్ నెట్వర్క్ విస్తరించడానికి అవసరమైన చర్యలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

 బండి సంపత్ కుమార్,