30 August, 2026 | 11:36 AM

తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే

20-05-2024 02:20 AM

బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు

కరీంనగర్ సిటీ, మే 19 (విజయక్రాంతి):  తడిసిన వడ్లను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, తాలు, తరుగు, తేమ పేరిట రైతాంగాన్ని వేధించొద్దని  బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు డిమాండ్ చేశారు.. ఆదివారం కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లన్నీ కొనాలంటే ప్రభుత్వంపై వందల కోట్ల భారం పడుతుందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం జంకుతున్నదన్నారు. వందల కోట్ల నిధులకే భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ అమలు కోసం వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకువస్తుందని ప్రశ్నించారు.

ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీని ఎవరు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.  రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం పదేళ్లుగా కట్టుబడి పనిచేసిందన్నారు. రైతులకు వివిధ రకాల ఎరువుల కోసం ఎకరాకు 30 వేల ఎరువుల సబ్సిడీ, ప్రతి రైతుకు ఆరువేల కిసాన్ నిధి, నాణ్యమైన విద్యుత్తు, పంటలకు మద్దతు ధర, పదేళ్లలో 50శాతం పెరుగుదల, రామగుండం ఎరువుల కర్మాగారం 6500 కోట్లతో పునరుద్ధరించిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

  కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను ఎప్పటిలోగా అమలు చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.  కార్యక్రమంలో నాయకులు దుబాల శ్రీనివాస్, కన్న కృష్ణ, బండ రమణారెడ్డి, పవన్, సత్యనారాయణ, కటకం లోకేష్, పర్వతాల మల్లేశం, గుంజేటి శివ, రవి, తదితరులు పాల్గొన్నారు. 

ప్రకృతి వైపరీత్యం కాదు.. ప్రభుత్వ వైఫల్యమే

జగిత్యాల, మే19(విజయక్రాంతి): సకాలంలో ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని వేములవాడ బీజేపీ నాయకుడు డాక్టర్ చెన్నమనేని వికాస్‌రావు ఆరోపించారు. తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రకృతి వైపరీత్యమని పేర్కొనడం శోచనీయమని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.   ఎండిన ధాన్యాన్నే సకాలంలో కొనుగోలు చేయలేని ప్రభుతం తడిసిన ధాన్యాన్ని కొంటామని మొక్కుబడి హామీలిస్తున్నదని మండిపడ్డారు.

పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోతే రోడ్డెక్కి ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు కంటే సత్యనారాయణ,  నాయకులు రాచమడుగు శ్రీనివాస్ రావు, మేడిపెల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ముంజ శ్రీనివాస్ గౌడ్,  గాంధారి శ్రీనివాస్, మల్యాల మారుతి, కాసోజి ప్రతాప్, కోడిపెల్లి అనీల్ రెడ్డి, ధర్మపురి జలంధర్, పాలేపు నరేష్,  బండ రాజం, కల్లూరి నడిపి మల్లేశం, గొల్లపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.