కట్టలు తెంచుకున్న కర్షకుల ఆగ్రహం
పండించడం కంటే అమ్ముకోవడమే కష్టమని అసహనం
వరి కుప్పలకు నిప్పు పెట్టే యత్నం
జగిత్యాల, మే 19 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహించిన ఓ రైతు గ్యాస్ పోసి వడ్ల కుప్పలకు నిప్పంటించి తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. జగిత్యాల మండలం గోపాల్ రావుపేట ఐకేపి సెంటర్‌కు అదే గ్రామానికి చెందిన రైతు సందీప్ కొన్ని రోజుల కిందట ధాన్యం తీసుకొచ్చాడు. ఇప్పటికైనా కొనుగోలు చేస్తారేమోనని ఆదివారం కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు. కానీ, నిరాశే ఎదురుకావడంతో సందీప్ గ్యాస్ పోసి వడ్ల కుప్పలు తగలబెట్టేందుకు ప్రయత్నించాడు.
మిగతా రైతులు వారించి సందీప్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెల రోజుల క్రితం తీసుకొచ్చినా వడ్లు కూడా కొనడం లేదని మండిపడ్డారు. ఒకపక్క వర్షాలు పడుతుంటే.. కొనుగోళ్లు చేపట్టడంలో ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
రెండు కిలోలు కోత..
ఒక పక్క వానలు, మరోపక్క ఆలస్యమవుతున్న కొనుగోళ్లతో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారంటే తాజాగా, ధాన్యం తూకంలో రెండు కిలోల వరకు కోత విధించడం వారిని మరింత కుంగదీస్తోంది. దీంతో రైతులు ఆందోళన బాటపట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం జగిత్యాల మండలం కట్లకుంట శివసాయి సెంటర్‌లో రైతులకు, కొనుగోలుదారులకు మధ్య వివాదం చోటుచేసుకుంది. తాలు పేరుతో బస్తా కి రెండు కిలోల అదనంగా కోత విధించడం సరికాదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ రైతుకు చెందిన 103బస్తాలు మిల్లుకు చేరాక ఫోన్ చేసి నాలుగు క్వింటాళ్ల మేర కోత పెడుతున్నట్లు చెప్పడంపై సదరు రైతు సెంటర్ నిర్వాహకులను నిలదీశాడు. దీనిపై ఏపిఎం అశోక్‌ను సంప్రదించగా తనకేమీ తెలియదని నిర్లక్ష్యం గా చెప్పడంపై రైతులు మరింత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు, కొనుగోలు దారులు, మిల్లర్లు మూకుమ్మడిగా కుమ్మక్కై రైతులను నిట్టనిలువునా దోచుకుంటున్నారని, స్వయంగా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.






